Publish Date: Sun, 04 Jul 2021 (18:29 IST)
Updated Date: Sun, 04 Jul 2021 (18:33 IST)
వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా, దక్షిణ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. అదేసమయంలో, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తాజా నివేదికలో తెలిపింది.
మరోవైపు, విశాఖ జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. జిల్లాలోని పాడేరు, చీడికాడ, దేవరాపల్లి, హుకుంపేట, అనంతగిరి, ఎల్.కోట, వేపాడ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. వ్యవసాయ క్షేత్రాల్లోని రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేసింది.