Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

అంగన్‌వాడీలకు నాణ్యమైన బియ్యం: డాక్టర్ కృతికా శుక్లా

Advertiesment
Quality rice
, సోమవారం, 1 జూన్ 2020 (18:58 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్ని(sortex rice) అందించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం కంటే ఇవి అన్ని విధాల మెరుగైనవిగా ఉంటాయన్నారు.
 
ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో భారత ఆహార సంస్థ ప్రమాణాల మేరకు విరిగిన బియ్యం 25 శాతం వరకు ఉంటాయని, ఇకపై పంపిణీ చేసే బియ్యంలో అది 15 శాతానికే పరిమితం కానుందన్నారు. రంగు మారిన గింజలు మూడు శాతం నుండి 0.75కు తగ్గుతాయన్నారు. అదే క్రమంలో దెబ్బతిన్న గింజల శాతం కూడా మూడు నుండి 0.75 శాతానికే పరిమితం కానున్నాయని డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు అందించే బియ్యం విషయంలో రాజీ పడరాదన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష కాగా తదనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయన్నారు.
 
ప్రస్తుత జూన్ మాసానికి సంబంధించి నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభం కానుందని, ఇప్పటికే జిల్లా స్థాయి, ఆయా ప్రాంతాల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసామని, ఈ బియ్యం ప్రత్యేకమైన సంచులతో ఐసిడిఎస్ ముద్రతో ఉంటాయని సంచాలకులు తెలిపారు. పౌర సరఫరాల శాఖకు బియ్యం సరఫరా బాధ్యతను అప్పగించామని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని బియ్యాన్ని జిల్లా యంత్రాంగం స్వీకరించనవసరం లేదన్నారు. పంపిణీ కోసం సిద్ధం చేసిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ కేంద్రంలో సోమవారం కృతికా శుక్లా స్వయంగా పరిశీలించారు.
webdunia
మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార కార్యక్రమాన్ని జూన్ నెలలో రెండు విడతలుగా అందించటం జరగుతుందని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ మరోమారు పొడిగించిన నేపధ్యంలో సాధారణ అనుబంధ పోషకాహారం కార్యక్రమం, బాలామృతం, బాల సంజీవని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పధకాలలో భాగంగా 6 నుండి 36 నెలలు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు తొలి విడతగా ఐదవ తేదీ లోపు, మలి విడతగా 16,17 తేదీలలో రేషన్ పంపిణీ చేయనున్నామన్నారు.
 
సిఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఎటువంటి ఇబ్బందిపడకుండా బియ్యం, కందిపప్పు, గుడ్లు, పాలు, నూనె, బాలామృతంలను లబ్దిదారుకు పంపిణీ చేసే క్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యచరణతో ముందుకు సాగుతుందని, లాక్ డౌన్ సమయంలో అందించిన సేవలపై లాక్ డౌన్ ముగిసిన తదుపరి సోషల్ అడిట్ నిర్వహిస్తామని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని డాక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు.
 
కరోనా నేపధ్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు రేషన్ ఇచ్చే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవలసి ఉండగా, సబ్బులు, శానిటైజర్లు కొనుక్కోడానికి ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నిధులను ఉపయోగించుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని పంపిణీ చేయాలని ఆదేశించామని, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా వలస కుటుంబాలలోని లబ్ధిదారులకు అందించిన రేషన్ వివరాలను సైతం రికార్డు చేయవలసి ఉంటుందన్నారు.
 
పంపిణీ కార్యక్రమం అంతా జిల్లా పరిపాలన అధికారి పర్యవేక్షణలో జరగవలసి ఉండగా, ఇంటివద్దనే రేషన్ తీసుకున్న లబ్ధిదారుల హాజరును సిఎఎస్ మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సీ.డీ.పీ.ఓ. లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులు పోషకాహార వినియోగంలో ఎటువంటి అంతరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షావోమీ నుంచి ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు ఇవే..