కరోనా లాక్ డౌన్ పరిస్ధితుల నేపధ్యంలో ప్రసవానికి సిద్దంగా ఉన్న గర్భవతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రసవానికి అనుకూలత ఉన్న వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా స్ధాయి అధికారులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసామన్నారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	రాష్ట్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్లు, సిడిపివోలు, అంగన్ వాడీ సూపర్ వైజర్లు, కార్యకర్తలు శాఖపరమైన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసారు. ప్రతి అంగన్ వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భవతుల వివరాలను అందుబాటులో ఉంచుకుని ప్రతి 2 రోజులకు ఒకసారి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయనున్నారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సామాజికి దూరం పాటించటం, ముసుగులను ధరించటం, తరచుగా చేతులను శుభ్రపరుచుకోవటం వంటి వాటిపై గర్భిణిలకు పూర్తి స్ధాయి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రసవం తేదీ అంచనా సమయానికి వారం ముందే అన్ని ఏర్పాట్లు చేసుకునేలా కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలని నిర్ధేశించామన్నారు.
	 
	ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గర్భవతులు ప్రసవ కాలంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారని, తదనుగుణంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తగిన ఏర్పాట్లు చేస్తుందని సంచాలకులు వివరించారు. తమ ప్రాంతానికి దగ్గగా ఉండే 108, 104, 102 వాహనాల డ్రైవర్ల నెంబర్లు సైతం అందుబాటులో ఉంచుకోవటమే కాకుండా, దగ్గరలోని గైనకాలజిస్టు, ప్రభుత్వ డాక్టర్ల నెంబర్లు సేకరించి పెట్టుకోవాలని అంగన్ వాడీ కార్యక్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసామని, వారు ఈ సమాచారాన్ని గర్భిణిలకు కూడా అందించవలసి ఉంటుందన్నారు. 
	 
	ఎరుపు, నారింజ ప్రాంతాలుగా ప్రకటించిన చోట అంగన్ వాడీ కార్యకర్తలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అక్కడి నిబంధనలను ఆకళింపు చేసుకుంటే సమస్యలను త్వరితగతిన అధికమించి సకాలంలో ఆసుపత్రికి చేరగలుగుతారని డాక్టర్ శుక్లా పేర్కొన్నారు. ప్రసవం సమయంలో అవసమైన వస్తు సామాగ్రిని ముందుగానే సిద్దం చేసి ఉంచుకోవాలని, అత్యవసర మందుల కోసం కుటుంబ సభ్యులు తగిన నగదు కలిగి ఉండేలా ప్రోత్సహించాలని, ప్రసవ వేదన మొదలు ప్రసవం అయ్యే వరకు కార్యకర్తలు అక్కడే ఉండి సజావుగా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేలా వారికి సహకరించవలసి ఉంటుందన్నారు. గర్భవతుల పరంగా ప్రసవ సమయంలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా అంగన్ వాడీ కార్యకర్తలు వెంటనే సిడిపిఒ, ప్రాజెక్టు డైరెక్టర్లను ఫోన్ ద్వారా సంప్రదించి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.