చంద్రయాన్ 2: నరేంద్ర మోదీ కెమెరాలను చూసే ఇస్రో చీఫ్ శివన్‌ను ఓదార్చారా? (Fact Check)

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (16:35 IST)
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇస్రో ఛైర్మన్ కే శివన్ కలిసి కనిపిస్తున్న వీడియో క్లిప్ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. మోదీ ప్రవర్తన కెమెరాల ముందు ఒకలా, అవి లేనప్పుడు మరోలా ఉంటుందంటూ ట్విటర్‌లో @Nehr_who అనే యూజర్‌నేమ్‌తో ఉన్న వ్యక్తి దాన్ని పోస్ట్ చేశారు. 'రెండు ముఖాలు' అన్న క్యాప్షన్ దానికి జోడించారు. ఈ వీడియోలో మొత్తం రెండు క్లిప్‌లు ఉన్నాయి.

 
చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్‌తో ఇస్రో కమ్యునికేషన్ కోల్పోయిన విషయాన్ని తెలియజేసేందుకు వచ్చిన శివన్‌తో మోదీ చాలా సాధారణంగా వ్యవహరించి, తిరిగి తన కుర్చీలో కూర్చున్నట్లుగా తొలి క్లిప్ ఉంది. 'కెమెరాలు లేని సమయంలో రియాక్షన్ ఇది.. కౌగిలింతలు, ఓదార్పులు ఏవీ లేవు' అన్న వ్యాఖ్యను దానిపై రాశారు.

 
మరో క్లిప్‌లో శివన్‌ను హత్తుకుని మోదీ ఓదార్చుతూ కనిపించారు. ఈ క్లిప్‌పై 'ఇది కెమెరాలున్నప్పుడు రియాక్షన్' అన్న కామెంట్ పెట్టారు. 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్విటర్‌, ఫేస్‌బుక్‌ల్లో కలిపి ఆరు లక్షల మందికిపైగా వీక్షించారు. వందల సంఖ్యలో జనాలు షేర్ చేశారు. వాట్సాప్‌లోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై చాలా మంది మోదీని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు.

 
''మీడియా, కెమెరాలు లేవన్న కారణంతో మోదీ శివన్‌ను పట్టించుకోలేదు. ఆ తర్వాత తీరిగ్గా డ్రెస్ మార్చుకుని వచ్చి, కెమెరాల ముందు మాత్రం ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు'' అంటూ కొందరు వ్యాఖ్యలు చేశారు. కానీ, బీబీసీ పరిశీలించినప్పుడు ఈ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని తేలింది. దూరదర్శన్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోల్లోని కొన్ని భాగాలను కత్తిరించి తప్పుదోవ పట్టించేలా ఈ వీడియోను రూపొందించినట్లు వెల్లడైంది.

 
పూర్తి ప్రసారాలను వీక్షిస్తే మోదీ ఆ రెండు సందర్భాల్లోనూ శివన్‌ను, ఇతర శాస్త్రవేత్తలను ఓదారుస్తూనే కనిపించారు. ప్రయోగం గురించి వారికి ధైర్యం చెప్తూ ఉన్నారు. శివన్ సమాచారం తెలియజేశాక, మోదీ పెద్దగా మాట్లాడకుండా ఉన్నట్లు కనిపించిన మొదటి క్లిప్ సెప్టెంబర్ అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంటన్నర సమయంలో తీసింది. ఇస్రో కేంద్రంలో విక్రమ్ ల్యాండింగ్ కోసం జరిగిన వ్యవహారాన్నంతా దూరదర్శన్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

 
రాత్రి 12 గంటలకు ఈ ప్రసారం మొదలైంది. ఆ తర్వాత 23 నిమిషాలకు మోదీ ఇస్రో 'మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్'లోకి ప్రవేశించారు. ప్రత్యక్ష ప్రసారం మొదలైన 51వ నిమిషం వరకూ విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ అనుకున్నట్లుగా సాగింది. ఆ తర్వాత ఇస్రో కేంద్రంలో అయోమయం మొదలైంది. ల్యాండర్ నుంచి కమ్యునికేషన్ ఆగిపోయింది.

 
ల్యాండర్‌తో కమ్యునికేషన్ కోల్పోయిన విషయాన్ని శివన్ ప్రోటోకాల్ ప్రకారం ముందుగా ప్రధాని మోదీకి చెప్పి, ఆ తర్వాత 1.45కి అధికారికంగా ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ కంట్రోల్ సెంటర్‌లోకి వచ్చి ఇస్రో ఛైర్మన్ శివన్ సహా ఇతర శాస్త్రవేత్తలతో మాట్లాడారు. శివన్ భుజం తట్టి.. ''ఆశలు కోల్పోవద్దు'' అని చెప్పారు.

 
''సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు. అన్నీ ప్రయోగాలు, ప్రయాణాలే. మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత శ్రమించారో దేశానికి తెలుసు. నేను, దేశం మీ వెంట ఉన్నాం'' అంటూ వారికి భరోసానిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత కొందరు విద్యార్థులను కలిసి, ఇస్రో సెంటర్ ‌నుంచి మోదీ వెళ్లిపోయారు. రెండో క్లిప్ ఆ మర్నాడు అంటే సెప్టెంబర్ 7న ఉదయం తీసింది.

 
ఆ రోజు ఉదయం 8 గంటలకు ఇస్రో సెంటర్‌లో తాను శాస్త్రవేత్తలను కలవబోతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఉదయం 7.20కి ఆయన ఇస్రో సెంటర్ చేరుకున్నారు. ఇస్రో చైర్మన్ కే శివన్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత 'మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్‌లో మోదీ సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారు.

 
‘మీ మనస్సులో ఉన్న బాధను నేను అర్థం చేసుకోగలను. గత రాత్రి మీ ముఖాల్లో ఆవేదనను నేను స్పష్టంగా చూడగలిగా. అందుకే మీతో ఎక్కువ సేపు గడపలేకపోయా. తెల్లవారిన తర్వాత మిమ్మల్ని కలిసి, మాట్లాడాలనుకున్నా'' అని మోదీ అన్నారు. ఈ సమయంలో శివన్ ప్రధాని మోదీ దగ్గరే నిలబడే ఉన్నారు. ప్రసంగం పూర్తయ్యాక మోదీకి శివన్ తమ బృందంలోని శాస్త్రవేత్తలను పరిచయం చేశారు.

 
ఆ తర్వాత 8:15కు మోదీ ఇస్రో సెంటర్ ‌నుంచి బయటకువచ్చారు. ఈ కార్యక్రమం కూడా దూరదర్శన్ న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. 'మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్' గేట్ వద్దకు వచ్చాక మోదీ వెనక్కి తిరిగి శివన్ ఎక్కడున్నారని ఆరా తీశారు. ఆ సమయంలో శివన్ భావోద్వేగంతో ఏదో అన్నారు. ఆ తర్వాత మోదీ ఆయన్ను హత్తుకుని ఓదార్చారు. శివన్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హృదయ విదారక ఘటన.. కన్నీళ్లు ఆపతరమా?