Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొడిగించిన లాక్ డౌన్ కాలానికి సైతం ఇంటి వద్దనే పోషకాహారం: డాక్టర్ కృతికా శుక్లా

Advertiesment
Home delivery
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (17:53 IST)
లాక్ డౌన్ కాలపరిమితిని పొడిగించిన నేపధ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. 6-36, 36-72 నెలల వయస్సు గల పిల్లలు, గర్భిణీ, బాలింతలకు మరో విడత ఇంటి వద్దనే పోషకాహారం అందించనున్నామన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు పదిహేను దినాలకు వర్తించేలా పోషకాహార వస్తు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 
 
గురువారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారని, సాధారణ అదనపు పోషకాహార కార్యక్రమం కింద గర్భిణీలు, బాలింతలు ప్రతి ఒక్కరికీ 2 కిలోలు బియ్యం, 400 గ్రాములు కందిపప్పు, 250 మి.లీ. నూనె, 30 గుడ్లు, 3 లీటర్ల పాలు అందిస్తారన్నారు. 36-72 నెలల పిల్లలకు 2 కిలోల బియ్యం, 400 గ్రాముల కందిపప్పు, 200 మి.లీ. నూనె, 15 గుడ్లు పంపిణీ చేయటం జరుగుతుందని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. 
 
బాలా సంజీవని పథకం కింద పోషకాహార లోపం ఉన్న 6-36 నెలల పిల్లలకు 15 గుడ్లు, 1.5 లీటర్లుపాలు, 36-72 నెలల పిల్లలకు 1.5 లీటర్ల పాలు, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా 77 మండలాలలో 6 నుండి 36 నెలల పిల్లలకు 18 గుడ్లు, 3.6 లీటర్ల పాలు, 36-72 నెలల పిల్లలకు  3 లీటర్ల పాలు పంపిణీ చేస్తామన్నారు.
 
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలకు ఇచ్చే అదనపు పోషకాహారం, 6 నుండి 36 నెలల పిల్లలకు రెగ్యులర్ గా ఇచ్చే బాలామృతం వారి అర్హతను బట్టి అందిస్తారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో  ఇంటి వద్ద రేషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా నియమాలు ఆచరించాలని, రేషన్ పంపిణీ మహిళా సంరక్షణ కార్యదర్శి, ఐసిడిఎస్ సూపర్ వైజర్ పర్యవేక్షణలో జరగాలని, అంగన్ వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందించాలే తప్ప వారిని తమ వద్దకు రావాలని కోరరాదన్నారు. 
 
ఇంట్లో నుండి ఒక్కరు మాత్రమే బయటికి వచ్చి సరుకులు తీసుకునేలా చూడాలని, ఆ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత కీలకమని అంగన్ వాడీ కార్యకర్తలు రేషన్ ఇచ్చే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవటమే కాక, తప్పనిసరిగా ముఖానికి మాస్క్ పెట్టుకుని, సరుకులు వారి పోషణ కొరకు ఇవి ఎలా వాడుకోవాలో వివరిస్తారన్నారు. నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రభుత్వ పరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు.
 
కుటుంబంలోని 6-72 నెలల పిల్లలు, గర్భిణీ, బాలింతల సంఖ్యను బట్టి పాలు అందించి,  లబ్ధిదారులు మాత్రమే పాలు వినియోగించేలా హెచ్చరించాలని, రేషన్ తీసుకున్న లబ్ధిదారుల హాజరు నమోదు చేసేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సీడీపీఓలు తగు చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. లోటు పాట్లకు అవకాశం లేకుండా టేక్ హోమ్ రేషన్ ఎన్ని రోజులకి ఇచ్చారో, ప్రతీ లభ్డిదారుని సిఎఎస్ లో నమోదు చేయాలని ఆదేశించామన్నారు.
 
జిల్లా పరిపాలనాధికారితో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు సమన్వయం చేసుకొని అంగన్ వాడీ కేంద్రాలకు నిర్దేశించిన సరుకులు, గుడ్లు, పాలు తాజావి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని, లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా పరిపాలనాధికారి దృష్టికి తీసుకు వెళ్లవలసి ఉంటుందని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. మరో వైపు 181 కాల్ సెంటర్ ద్వారా పోషకాహార పంపిణీ పై లబ్డి దారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని వివిధ స్దాయిల అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 3 వరకు లాక్‌డౌన్ : అనుమతులున్నవి.. అనుమతులు లేనివి ఏవి?