Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో అల్లర్లు.. ఏ1గా చంద్రబాబు - ఏ2గా దేవినేని ఉమ

chandrababu
, బుధవారం, 9 ఆగస్టు 2023 (10:33 IST)
ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికార వైకాపా నేతలు రెచ్చిపోయి టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. వీరికి పూర్తి స్థాయిలో పోలీసులు సహకరించారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో చంద్రబాబు పర్యటనలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. అంగళ్లులో జరిగిన అల్లర్లపై ముదివేడు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే పోలీసులు నమోదు చేశారు. అలాగే, పుంగనూరులో జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 74 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి, వీరి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
 
ఈ నేపథ్యంలో తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని అంగళ్లు వీధిలో జరిగిన అల్లర్లకు సంబంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముదివేడు పోలీసుల కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్లను చేర్చారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ వీరిపై కేసులు పెట్టారు. ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 505 ఆర్ డబ్ల్యూ, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
మరోవైపు, ఈ అల్లర్లకు సంబంధించి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయడాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వైకాపా నేతలు అల్లర్లకు పాల్పడితే తమపై కేసులు నమోదు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే, పోలీసులు అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నేతలు ధైర్యం చెబుతూ అండగా నిలబడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోసకారి వాలంటీర్ : మహిళ వేలి ముద్రతో రూ.1.70 లక్షలు స్వాహా