Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. కర్నూలులోనే మకాం వేసిన ఏపీ కేబినెట్

Advertiesment
Chandrababu-Modi

ఠాగూర్

, బుధవారం, 15 అక్టోబరు 2025 (11:58 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఒక రోజు పర్యటనలోభాగంగా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సుమారు రూ.13,429 కోట్ల విలువైన 16 కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పారిశ్రామిక పార్కు వంటివి ఈ ప్రాజెక్టులలో ప్రధానమైనవి.
 
కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. దేశంలోనే జీఎస్టీ-2.0పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు హాజరుకానున్నారు.
 
ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కర్నూలులోనే మకాం వేసింది. సుమారు 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సభకు మూడు నుంచి నాలుగు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో, అందుకు తగినట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం రేయింబవుళ్ళు శ్రమిస్తోంది. 
 
ఇదిలావుంటే, కాగా, ఈ బహిరంగ సభకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఢిల్లీ నుంచి నేరుగా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టరులో శ్రీశైలం వెళతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామిని, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం, పురావస్తు శాఖ ప్రదర్శనకు ఉంచిన పురాతన తామ్ర శాసనాలు, రాగి రేకులను ఆయన వీక్షిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారిగా వేడెక్కిన జూబ్లీహిల్స్ ఉప పోరు : గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ!!