ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి స్థానాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. భీమవరం (పశ్చిమ గోదావరి), గాజువాక(విశాఖ) నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. తాను పోటీ చేయబోతున్న స్థానాలపై గంట తర్వాత వివరాలు చెప్తానని పవన్ మంగళవారం ఉదయం ట్వీట్ ద్వారా తెలియజేసారు.
ఆ తర్వాత విస్తృతంగా చర్చలు జరిపిన పార్టీ నాయకులు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పవన్ పోటీ చేసే స్థానాలను అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండడం తమకు కలిసి వచ్చే అంశంగా వారు భావిస్తున్నారు. భీమవరంలో 2004 నుండి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు.
గతంలో 2009 సాధారణ ఎన్నికల్లో పవన్ అన్న చిరంజీవి సైతం రెండు చోట్ల నుండి పోటీ చేసారు. సొంత జిల్లాలో ఓడిపోయిన చిరంజీవి, తిరుపతిలో విజయం సాధించారు. ప్రస్తుతం జరుగబోతున్న ఎన్నికల్లో పవన్ మూడు జాబితాల్లో 77 మంది అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలను కేటాయించారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున అసెంబ్లీ, రెండేసి లోక్‌సభ స్థానాలను కేటాయించారు.