వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాల పేర్లను ఆ పార్టీ కార్యవర్గం మంగళవారం ఖరారు చేసింది. ఆయన తన అన్న చిరంజీవి గతంలో పోటీ చేసినట్టుగానే రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణం జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నుంచి ప్రకటన వెలువడింది. నామినేషన్ దాఖలు చేసే రోజును ఈ మంగళవారం లేదా బుధవారం ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.
నిజానికి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అదేసమయంలో జనసేన కార్యవర్గం సభ్యులు కూడా ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై సర్వే కూడా నిర్వహించారు.
ఈ సర్వేలో అనంతపురం, తిరుపతి, రాజానగరం, భీమవరం, పిఠాపురం, పెందుర్తి, గాజువాక, ఇచ్ఛాపురంలు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ 8 స్థానాలపై జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు అంతర్గత సర్వేను నిర్వహించారు. అనంతరం భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేయాలని పవన్‌కు సూచించారు. వారి సూచన మేరకు ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు.
కాగా, గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు. వాటిలో ఒకటి తిరుపతి కాగా, రెండోది పాలకొల్లు. ఇందులో తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందగా, పాలకొల్లు నుంచి చిత్తుగా ఓడిపోయారు.