ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషనులో కొందరు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఈ స్టేషనులోని లిఫ్టులో పలువురు ప్రయాణికులు చిక్కుకునిపోయారు. ఫ్లాట్‌ఫామ్ మారేందుకు 14 మంది ప్రయాణికులు స్టేషన్‌లోని లిఫ్టు ఎక్కారు. అయితే, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ లిఫ్టు ఆగిపోయి తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు లిఫ్టులోనే మూడు గంటల పాటు నానా అవస్థలు పడ్డారు.
లిఫ్టులో చిక్కున్నవారి కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. వీరంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్‌కు రాగా.. ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, ఈ మధ్యకాలంలో అనేక రైల్వే స్టేషన్‌లలో లిఫ్టు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ లిఫ్టు సౌకర్యం ప్రారంభించిన కొద్ది రోజుల వరకు బాగానే పనిచేసినప్పటికీ ఆ తర్వాత లిఫ్టుకు సర్వీసు చేయకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడ వంటి చర్యల కారణంగా ఇవి మొరాయిస్తూ, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.