Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగులంటే అంతచులకన దేనికి? పయ్యావుల కేశవ్

Advertiesment
ఉద్యోగులంటే అంతచులకన దేనికి? పయ్యావుల కేశవ్
విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (17:35 IST)
అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్లలో జగన్ రెడ్డి సర్కారు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయకపోగా, అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంద‌ని పిఎసి ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ ఆరోపించారు. 
 
 
పిఆర్ సి అమలు, సిపిఎస్ రద్దు, డిఎ బకాయిల విడుదల వంటి అంశాలను కనీసం ప్రస్తావించకుండా ఏదో ఒక సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా అని సాక్షాత్తు ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారంటే ప్రభుత్వోద్యోగులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమవుతోంద‌న్నారు. నాలుగు గోడల మధ్య విధులు నిర్వర్తించే ఉద్యోగులను జీతాల కోసం రోడ్డెక్కే పరిస్థితి కల్పించార‌ని, పిఆర్ సి అడుగుతున్న ఉద్యోగ సంఘ నాయకులను ఒక రోజంతా సెక్రటేరియట్ లో నిలబెట్టి అవమానించడమంటే, రాష్ట్రంలోని ఆరులక్షలమంది ప్రభుత్వోద్యోగులను అవమానించినట్లే అన్నారు.
 
 
దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ధర్మపోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంద‌ని ప‌య్యావుల చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు, పిఆర్ సి అమలు, డిఎ బకాయిల విడుదల వంటి సమస్యలను పరిష్కరిస్తామన్న జగన్ రెడ్డి రెండున్నరేళ్లుగా ముఖం చాటేయడం దుర్మార్గం అన్నారు. చివరికి కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి మట్టి ఖర్చులు, పరిహారం ఇవ్వకపోవడం దారుణం అని విమ‌ర్శించారు. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలకపాత్ర వహించే ఉద్యోగ సంఘాల నాయకులకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం శోచనీయమ‌ని,  ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? అని ప్ర‌శ్నించారు. 
 

చివరికి ఉద్యోగుల జీతాలనుంచి దాచుకున్న జిపిఎఫ్ సొమ్మును కూడా వారికి తెలియకుండా దారి మళ్లించడం సిగ్గుచేట‌ని, పిఆర్ సి బకాయిలు కొండల్లా పేరుకుపోతుంటే కనీసం నివేదిక బయటపెట్టకుండా ఎటువంటి భరోసా కల్పించకుండా ఆందోళనకు గురిచేయడంలో అంతర్యమేమిటి? అని ప్ర‌శ్నించారు. 50శాతం ఫిట్ మెంట్ తో పిఆర్సీని అమలుచేసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంద‌ని పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహమా? వరుణ్ గాంధీ ఫైర్