ప్రకృతి సంపదలైన భూమి, గాలి, నీరు, వెలుతురు అందరికి దక్కాలి.. భూమి మాత్రం కొందరి చేతుల్లో ఉంది.. ఆ భూమి దున్నేవాడికే ఇప్పించేందుకు ఎంఎల్‌పార్టీ కొనసాగించిన సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులను తలుస్తూ నేటి నుంచి వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ సన్నద్ధమవుతోంది. నక్సల్‌బరి సృష్టికర్త చార్‌మజుందర్ వర్ధంతిని అమరవీరుల వారోత్సవాలుగా తలుస్తూ ప్రతి ఏటా 1980 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరుపుతున్నారు.
నక్సల్‌బరికి 52ఏళ్లు.. దాని సృష్టికర్త భార త విప్లవ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన చారుమజుందార్‌కు వందేళ్లు నిండాయి.మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని భారత విప్లవ పరిస్థితులకు అన్వయించుకొని ‘ఖతం’ కార్యక్రమంతో వర్గశత్రు నిర్మూలన పోరాటాన్ని కొనసాగించిన భారత విప్లవపార్టీల పితామహుడు చార్‌మజుందార్ వర్ధంతి వేడుకలు ఆదివారం నుంచి జరగనున్నాయి.
నక్సల్‌బరి 52 వసంతాల వేడుకల సందర్భంలో జరగనున్న అమరవీరుల వారోత్సవాలకు ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా విప్లవాభిమానులు, విప్లవ సంస్థలు నక్సల్‌బరి 52 వసంతాల వేడుకలు జరుపుతోంది విదితమే. ప్రకృతి సంపదలోని భూమి దున్నేవాడికే చెందాలంటూ వ్యవసాయిక విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవంతో సమసమాజ స్థాపన కోసం చార్ మజుందార్ కొనసాగించిన సాయుధ పోరు నడుపుతున్న మావోయిస్టు పార్టీ నేటి నుంచి వారం రోజులపా టువారోత్సవాన్ని జరుపుతోంది.
1965లో పశ్చిమ బెంగాల్ సిలుగురి కొండల్లో సంతాల్ తెగ విముక్తి కోసం చార్‌మజుందార్ నడిపిన సాయుధ పోరా టం దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ప్రధానంగా శ్రీకాకుళం వైపు నక్సల్‌బరి పోరాటం నడిచి వచ్చింది. విప్లవోద్యమాలకు చిరునామాగా నిలిచిన చార్‌మజుందార్ ప్రభావంతో జిల్లాలో 1974 నుంచి ఎంఎల్‌పార్టీగా కార్యకలాపాలు కొనసాగించారు. 1972 జూలై 28న జైళ్లో అమరుడైన చార్‌మజుందార్ వర్ధంతిని 1980లో తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి పీపుల్స్‌వార్‌పార్టీ జరిపింది.
అన్ని విప్లవపార్టీలు క్రమం తప్పకుండా ప్రతి ఏటా జూలై 28 నుంచి ఆగçస్టు 3 వరకు జరుపుతున్నాయి. ఈ సమయంలో చారు ఆశయసాధనలోని వర్గ శత్రు నిర్మూలన కార్యక్రమాన్ని ఉధృతం చేసిన పార్టీలలో పలు విప్లవపార్టీలు ఉనికిని కోల్పోగా, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ మాత్రమే తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గడిచిన పదేళ్లుగా కేవలం తూర్పు, పశ్చిమ అటవీ ప్రాంతాల్లోనే అడపాదడపా కార్యకలాపాలు నడుపుతున్న మావోయిస్టులు వర్ధంతి వేళ ఒకటి, రెండు సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మాజీ దళపతి కోటలో కదలిక లేని మావోలు..
దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాష్ట్ర కార్యదర్శులు, వివిధ జిల్లాలకు కార్యదర్శులను అందించి ఏకంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులే కాకుండా కార్యదర్శిగా పని చేసిన మావోయిస్టు మాజీ దళపతి గణపతి సొంత జిల్లాలో ఆపార్టీకి లోటు కనిపిస్తోంది. అమరవీరుల, పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భాల్లో అప్పట్లో అట్టుడికిన జిల్లా కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉంటోంది.
భారీ ఎన్‌కౌంటర్‌లు, లొంగుబాట్లతో జిల్లాలోని మావో యిస్టు దళాలు చత్తీస్‌ఘడ్, బస్తర్‌లాంటి ప్రాంతా లకు తరలిపోవడంతో మైదాన ప్రాంతాలు పూర్తి గా దళాల ఉనికి లేకుండా పోయాయి. ఇక జిల్లాకు తూర్పు, పశ్చిమ అటవీ ప్రాంతాల్లోనే దళాల సం చారం కొనసాగుతోంది. చార్‌మజుందార్ వారసులుగా దేశంలో కొండపల్లి సీతారామయ్య అరెస్టు తర్వాత కేజీ సత్యమూర్తి పీపుల్స్‌వార్ పార్టీకి నాయకత్వం వహించారు.
ఆయన పార్టీని వీడిపోవడం కొండపల్లి సీతారామయ్యను పార్టీ నుంచి బయటికి పంపిన తర్వాత విప్లవపార్టీ పగ్గాలు జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అందుకున్నారు. 1988 నుంచి వరసగా పీపుల్స్‌వార్ పార్టీ ప్రస్తుత మావోయిస్టు పార్టీకి గణపతి దళపతిగా ఉంటూ దేశంలోని 12 రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు. అయితే కరీంనగర్ జిల్లా కల్లోల పరిస్థితి నుంచి బయటపడి నక్సలైట్ కార్యకలాపాలకు దూరమైంది.
అయినా దేశంలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ల జాబితాలో ఉన్న పది మందిలో ఈ జిల్లాకు చెందిన ఐదుగురు ఉండడం విశేషం. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మావోలు గత 39 ఏళ్లు గా సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నరు. దరిమిలా ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు లు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు.