Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా చేస్తే సిక్కోలు 30 ఏళ్లు వెనక్కే... ఎలా...?

Advertiesment
అలా చేస్తే సిక్కోలు 30 ఏళ్లు వెనక్కే... ఎలా...?
, శనివారం, 20 జులై 2019 (19:30 IST)
రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా చేయడం అన్నది జరిగితే సిక్కోలు జిల్లా 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని "కళింగాంధ్ర" (ఫోరం ఫర్ యంగ్ లీడర్ షిప్) ప్రజల తరఫున ఆవేదన వ్యక్తం చేస్తుంది. శ్రీకాకుళం నగరంలో గల స్థానిక ఎన్జీఓ హోంలో శనివారం కళింగాంధ్ర ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్. పరమేశ్వరరావు, పి.సురేష్, డాక్టర్ గురుగుబెల్లి వంశీకృష్ణ, సీపాన రమేష్ కుమార్, మామిడి శ్రీకాంత్, బి.భాస్కర్, పి.జయరాం, వై.నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన మూలంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఆస్తులన్నీ తెలంగాణ రాష్ట్రానికి చెంది ఆంధ్రప్రదేశ్ కు అపారమైన నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అక్షర క్రమంలో దేశంలో ముందంజలో కనిపించే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇది జరిగి 5 ఏళ్లు దాటుతోందన్నారు. ఆ గాయం మానక ముందే మరో గాయం సిక్కోలు వాసులకు తగిలేలా ఉందని వారు తెలిపారు. 
 
"రాష్ట్రానికి శివారున ఉన్న శ్రీకాకుళం జిల్లా పేదరికంలో ఆంధ్ర రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉందని, శ్రీకాకుళం జిల్లా మరింత పేద జిల్లాగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని కళింగాంధ్ర హెచ్చరిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా రూపొందించేందుకు పాలకులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, పక్కాగా ఒక పార్లమెంట్ స్థానం ఉన్నాయి. 
 
ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని, పాలకోండ అసెంబ్లీ సెగ్మెంట్ అరుకు పార్లమెంట్ స్ధానం పరిధిలో ఉంది. రాష్ట్రంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా, వాటినే ప్రాతిపదికగా తీసుకొని జిల్లాలుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు అపారమైన నష్టం వాటిల్లేలా కనిపిస్తోందని కళింగాంధ్ర గట్టిగా గొంతెత్తి చెబుతోంది. 
 
విద్య వైద్య పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతమంతా శ్రీకాకుళం జిల్లా నుంచి విడిపోయి విజయనగరం జిల్లాలో కలుస్తుందని, దీంతో జిల్లా జి.డి.పి కూడా అమాంతంగా దిగువ స్థానానికి  చేరుకుంటుందని కళింగాంధ్ర చెబుతోంది. దేశంలో అత్యంత పేద జిల్లాలుగా గుర్తింపు పొందిన కోరాపుట్ - బోలాంగీర్-కలహండి (కెబికె) ప్రాంతం ఒడిస్సా రాష్ట్రం జిల్లాల తర్వాత శ్రీకాకుళం జిల్లాయే నిలుస్తుందని కళింగాంధ్ర గుర్తు చేస్తుంది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోగా, జిల్లా విభజన వల్ల మరో 30 ఏళ్లు వెనక్కు వెళ్లి పోయే ప్రమాదం ఉందని కళింగాంధ్ర పేర్కొంది. ఒకసారి శ్రీకాకుళం జిల్లాను భౌగోళికంగా తీసుకుంటే 193 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం వుండగా, 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. ఇంత పెద్ద తీర ప్రాంతం జాతీయ రహదారి ఉన్న ప్రాంతాలు దేశంలో అతి తక్కువ గానే కనిపిస్తాయి. జిల్లాలోని 11 మండలాల్లో మత్స్యకారులు ఉండగా, జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పోతున్నారు. 
 
పాకిస్తాన్ జైల్లో ఖైదీలుగా మారిన మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే. జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి ప్రత్యామ్నాయ ఆర్థిక అభివృద్ధికి పాలకులు ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే వలసల నివారణ సాధ్యం అయ్యేది .ఈ విషయమై కళింగాంధ్ర తీవ్ర నిరసనను తెలుపుతుంది. జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి ప్రత్యామ్నాయ ఆర్థిక అభివృద్ధికి పాలకుల ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే వలసల నివారణ సాధ్యం అయ్యేదని కళింగాంధ్ర భావన. 
 
మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి అదేంటంటే పారిశ్రామికంగా ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉంది. కొద్దో, గొప్పో పరిశ్రమలు ఉన్నప్పటికీ అవి కూడా ఎచ్చెర్ల ,రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం కలవర పెడుతున్నాయి. ఎందుకంటే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కనిపించే పరిశ్రమలు కూడా ఏమీ లేవు. కేవలం పలాసలో జీడి పరిశ్రమ ఉందని జనమంతా భావించినా, జీడిపిక్కలు కూడా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని చెల్లించే పరిస్థితి జిల్లాకు ఉందని కళింగాంధ్ర గుర్తుచేస్తోంది. 
 
ఉద్దానం ప్రాంతం నుండి ఏమాత్రం ఆదాయం వచ్చే పరిస్థితి కూడా నేడు కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల వచ్చిన తిత్లీతుఫాన్ ఆ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఇప్పటికీ దయనీయ స్థితిలోనే కనిపిస్తుంది. మరోవైపు సీతంపేట ఐటిడిఏకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చే పరిస్థితి ఉన్నా అరకు పార్లమెంట్ పరిధిలోకి సీతంపేట ఐటిడిఎ, పాలకొండ ప్రాంతం వెళ్లిపోయినట్టయితే ఇక ఆ నిధులు కూడా వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని కళింగాంధ్ర ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
జిల్లా కేంద్రంలో ఉండాల్సిన యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటి కూడా ఎచ్చెర్ల నియెాజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. పలు ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు ఉన్న విద్యా సంస్థలు కూడా అదే ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి . ఇప్పటివరకు ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్రంలో విజయనగరం జిల్లా అట్టడుగు స్థానంలో ఉండగా, దాని కంటే ఓ మెట్టు పైన శ్రీకాకుళం ఉంది. 
 
పార్లమెంటరీ నియోజకవర్గమే, జిల్లా ప్రాతిపదిక అయితే ,ఆ అట్టడుగు స్థానానికి కూడా శ్రీకాకుళం చేరుకుంటుందని, దీనిని మొదటిలోనే అడ్డుకుంటే మన జిల్లాతో పాటు భావితరాలకు భరోసా కల్పించే వారమవుతామని కళింగాంధ్ర ప్రతినిధులు భావిస్తున్నారు. అదేవిధంగా నాగావళి నదిపై జల హక్కులు కూడా విజయనగరం జిల్లాకే ఎక్కువగా చెందే పరిస్థితి ఉంటుంది. పార్లమెంటరీ నియోజకవర్గం ప్రాతిపదికగా తీసుకోవాలన్న ఆలోచన పాలకులు చేస్తే పెద్ద తప్పే అవుతుంది.
 
2024 లేదా 2026 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరిగి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మార్పు రావచ్చు. అందువల్ల పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోకూడదన్నది జిల్లా ప్రజల వాదన. కళింగాంధ్రతో పాటు జిల్లా ప్రజల వాదన కూడా. నవభారత్ జంక్షన్ వద్ద ఉన్న పారిశ్రామిక వాడ, పైడిభీమవరంలో ఉన్న పారిశ్రామికవాడ కూడా విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోతాయి.
 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థల సేకరణ మొదలు, నిర్మాణ చర్యలు వరకు శ్రీకారం చుడుతున్న అణువిద్యుత్ కేంద్రం కూడా విజయనగరం జిల్లాలోకే వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇక ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మెుదలు సంకిలిలో వున్న షుగర్ ఫ్యాక్టరీ వరకు అన్నీ అందులోనే చేరితే జిల్లాకు వచ్చే ఆదాయం ఏమీ ఉండదు. అందువల్ల కళింగాంధ్ర మన జిల్లా మన భవిష్యత్తు అనే నినాదంతో నేడు ముందుకు వచ్చింది. 
 
మన జిల్లాను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. అందుకే రండి కళింగాంధ్ర చేపట్టిన ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతుంది. ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు, రాజకీయ పార్టీలు, కుల,మతాలకు అతీతంగా పోరాటానికి సిద్ధం కావాలని కళింగాంధ్ర పిలుపునిస్తోంది. రానున్న రోజుల్లో మన జిల్లాకు జరగనున్న నష్టాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది .అందుకు కళింగాంధ్ర సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మాతో కలిసి నడవాలని ,మన భావితరాలకు భవిష్యత్ ను అందించే వారు కావాలని కళింగాంధ్ర ఆశిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లరాదు.. టిటిడి