Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖైదీల శ్రమకు వేతనంపై జీవో ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్, 4 గంటలకు రెడీ

Advertiesment
wages
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (18:18 IST)
ఏపీ హైకోర్టులో అరుదైన ఘటన జరిగింది. ఆగమేఘాలపై గంటల్లోనే ప్రభుత్వం జీవో జారీ చేయడం ఆసక్తి రేపింది. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు పనికి ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో జారీ అయ్యింది. ఖైదీల శ్రమకు న్యాయబద్ధమైన వేతనం చెల్లించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది తాండవ యోగేష్‌ 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇటీవల విచారణకు రాగా.. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇస్తుందని.. గడువు కావాలని జీపీ మహేశ్వరరెడ్డి కోరారు.
 
కోర్టు రెండు వారాల సమయం ఇవ్వగా.. గురువారం మరోసారి విచారణ జరిగింది. పరిపాలనా జాప్యం వల్ల ఉత్తర్వులను కోర్టు ముందు ఉంచలేకపోతున్నానని జీపీ తెలిపారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలన్నారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. తక్షణం జీవో జారీచేసి సాయంత్రం నాలుగు గంటల్లోగా కోర్టుకు సమర్పించాలని.. విఫలమైతే సంబంధిత అధికారులు హాజరవ్వాలని ఆదేశిస్తామంది.
 
విచారణను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది. వెంటనే అధికారులు అప్పటికప్పుడు జీవో జారీ చేసి.. విచారణ ప్రారంభం అయ్యాక జీపీ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు ఇచ్చిన హామీలకు అధికారులు విలువ ఇచ్చేలా చూడాలని ఏజీ ఎస్‌.శ్రీరామ్‌కు సూచించింది. కోర్టు ఉత్తర్వులను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించి.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
 
2019లో న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్‌‌లో ఖైదీల వేతనానికి సంబంధించి 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం నైపుణ్యం, సగం నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేనివారిగా విభజించి రూ.30, రూ.50, రూ.70 వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. తాజా జీవో ప్రకారం జైలు జీవితం అనుభవిస్తోన్న ఖైదీల కష్టానికి ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం పెంచింది.
 
జైల్లో ఖైదీలు కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, టైలర్‌ తదితర పనులు చేస్తూ రోజుకు రూ.70 వేతనం పొందేవారు. గతేడాది జూలైలో జైళ్లశాఖ డీజీ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు స్కిల్డ్‌ పనిచేసే ఖైదీలకు రోజుకు రూ.200 ఇచ్చేందుకు సమ్మతించింది. సెమీ స్కిల్డ్‌ వర్కర్‌కు రూ.180, అన్‌ స్కిల్డ్‌ వర్కర్‌కు రూ.160 ఇచ్చేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మినీ మేడారం జాతర.. ముగ్గురు సిబ్బందికి కోవిడ్.. కొందరిలో కరోనా లక్షణాలు