కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఎన్టీ రామారావు విగ్రహం చేయిని గుర్తుతెలియని వ్యక్తులు విరగకొట్టారు. దీనితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు.
నేషనల్ హైవే పక్కన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడానికి దుండగులకు ఎంత ధైర్యం? అని దేవినేని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టడం చంపడం చేస్తున్నారని ఆరోపించారు.
మొదట్లోనే వారి మీద కేసులు పెట్టి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదా ? అని ప్రశ్నించారు. నందిగామ జెండా దిమ్మ పగలగొట్టిన వారిపై ఎంత మంది పైన కేసులు పెట్టారు .. ఏమి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజాప్రసాదం నుంచి బయటకు రాడు... ఒక పక్క కృష్ణ జలాలు నీటి వివాదం.. మీ చేతిలో 28 మంది ఎంపీలు ఉండీ ఉపయోగం ఏమిటి? మీరు కోటలో ఉంటే, ఏమిటి పేటలో ఉంటే ఏమిటి! నారుమళ్లకు నీళ్లు ఇవ్వలేరు కానీ, విగ్రహాలు మాత్రం పగలగొడతారు ఈ దద్దమ్మలు... అని ఎద్దేవా చేశారు దేవినేని.