ఏపీకి ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సమాధానం ఇదే
అమరావతి : కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులో గురువారం మధ్యాహ్నం రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియ
అమరావతి : కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులో గురువారం మధ్యాహ్నం రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల సందర్శనలో భాగంగా ఏపీకి వచ్చినట్లు తెలిపారు. అందరు ముఖ్యమంత్రులను కలుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలన్నారు. నిన్న, ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు అంశాలు చర్చించినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ లక్ష్యాలు అద్భుతంగా ఉన్నట్లు ప్రశంసించారు.
రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రియల్ టైమ్ గవర్నెన్స్ విషయంలో ఏపీ అద్వితీయమైన విజయం సాధించినట్లు చెప్పారు. ఆర్టీజీ అనేది మంచి ఆలోచన అని, ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. ఆర్టీజీలో ఉపయోగించే డిజిటల్ టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చన్నారు. మిగతా రాష్ట్రాలకు, కేంద్రానికి ఆర్టీజీ ఓ నమూనా షోకేస్‌లా ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా 2022 నాటికి నూతన భారతదేశ ఆవిష్కరణలో ఏపీ ముందుంటుందన్నారు.
కోస్టల్ ఎకనామిక్ జోన్ (సీఈజడ్)కు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ రెండు జోన్లుగా ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా అంశం ప్రస్తావించగా దేశంలో సరాసరి తలసరి ఆదాయం కంటే ఏపీలో ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తామన్నారు.
మళ్లీ త్వరలోనే రాష్ట్రానికి వస్తామని, కేంద్రం రాష్ట్రాలకు అందించే ప్రాజెక్టుల విషయంలో ఏపీకి ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. తాను 1975లో వాల్తేర్‌లోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రిసెర్చ్ స్టూడెంట్‌గా ఉన్నట్లు తెలిపారు. యూనివర్సిటీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సి.కుటుంబ రావు, ఆర్టీజీ సీఈఓ బాబు ఉన్నారు.