భారత్‌లో ఉన్నట్లుగా లేదు... అమోఘం... అద్భుతం: ఏపిపై పొగడ్తలు
అమరావతి: రియల్ టైమ్ గవర్నెన్స్‌ను దాని పనితీరును చూస్తుంటే తాను భారత్‌లో ఉన్నట్లు అనిపించలేదని, ఇది అధ్భుతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అనిర్వచనీయమైన విజయమని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు (వైస్ ఛైర్మన్) డాక్టర్ రా
అమరావతి: రియల్ టైమ్ గవర్నెన్స్‌ను దాని పనితీరును చూస్తుంటే తాను భారత్‌లో ఉన్నట్లు అనిపించలేదని, ఇది అధ్భుతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అనిర్వచనీయమైన విజయమని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు (వైస్ ఛైర్మన్) డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీసీ)ను గురువారం ఆయన, ఆయన బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఈ కేంద్రం ఎలా పని చేస్తున్నది, ప్రజలకు సకాలంలో అందిస్తున్న సేవలు, డిజిటల్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతోనూ, మీడియాతోనూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సాధించిన ఒక అద్భుత విజయం ఆర్టీజీఎస్. ఇలాంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. ఇక్కడున్నంతసేపు తాను భారత్‌లో ఉన్నట్లుగా అనిపించలేదని, అంత గొప్పగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని కితాబిచ్చారు. ప్రతి రాష్ట్రానికి ఏపీ అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ కనువిప్పు కావాలని రాజీవ్ కుమార్ అన్నారు.
ప్రతి రాష్ట్రంలోనూ ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నదే తమ అభిప్రాయమన్నారు. ఇంత గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీజీఎస్ నిర్వహాకులను తాము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ భారతదేశపు భవిష్యత్తు ఇదేనని ఆయన ప్రశంసించారు. ప్రతి రాష్ట్రం ఇక్కడకు వచ్చి ఈ ఆర్టీజీఎస్‌ను పరిశీలించాలని తాము సిఫారసు చేస్తామన్నారు.
ఢిల్లీకి రావాలని ఆహ్వానం
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ ఢిల్లీలో దీన్ని ప్రదర్శించాలని ఆర్టీజీఎస్ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సదస్సు నిర్వహిస్తోందని, ఈ సదస్సులో ఏపీ అమలు చేస్తున్న ఆర్టీజీఎస్ విధానాన్ని ప్రదర్శించాలని కోరారు. తద్వారా మిగిలిన రాష్ట్రాల వారూ దీని గురించి తెలుసుకునే వీలుంటుందన్నారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే ఈ సదస్సు జరిగే తేదీని తెలియజేస్తామన్నారు.
దావోస్‌లో ప్రదర్శిస్తున్నాం : ఎ.బాబు
ఢిల్లీలో జరిగే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సదస్సులో ఆర్టీజీఎస్ గురించి ప్రదర్శించాలని నీతి ఆయోగ్ ఆహ్వానించడం పట్ల ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అహ్మద్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు తాము తప్పకుండా ఢిల్లీలో ఆర్టీజీఎస్‌ను ప్రదర్శించి వివరిస్తామని తెలిపారు. ఈ నెలలో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా దీన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలు అందించాలనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ప్రారంభించామని, ఆసియాలోనే అతి పెద్దదైన 62 అడుగుల పొడవైన వీడియో వాల్‌ను ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కెమెరాలతో నిఘాను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తామని, ప్రస్తుతం 5వేల కెమెరాల ఏర్పాటు చేశామని, త్వరలో 20 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూసారా పరీక్షలను ఎప్పటికప్పుడు పరీక్ష చేసి, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు రైతులకు ఆ వివరాలు అందజేస్తూ, ఆయా ప్రాంతాల భూసారాన్ని బట్టి అక్కడ పంటలు వేసుకునేలా రైతులకు సలహాలు ఇస్తున్నామని, ఇప్పడు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు.
ప్రజలు ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ దొంగతనాలు జరగకుండా నియంత్రించేలా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్ ఎంఎస్)ను సమర్థంగా అమలు చేస్తున్న తీరును ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమరనాథరెడ్డి, రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షులు చెరుకూరి కుటుంబరావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పరిశ్రమల శాఖ సంచాలకులు సిద్ధార్థ జైన్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రతినిధి ప్రీతమ్ రెడ్డి, ఆర్టీజీఎస్ సంచాలకులు బాలాజీ ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు.