Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొంభై రోజులు...తొమ్మిది తప్పటడుగులు

Advertiesment
తొంభై రోజులు...తొమ్మిది తప్పటడుగులు
, సోమవారం, 26 ఆగస్టు 2019 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వై.సి.పి.కి తిరుగులేని మెజారిటి ఇచ్చినా...కొన్ని ప్రజాకర్షక పనులతో పాటు అనేక తొందరపాటు నిర్ణయాలు, అధ్యయనం లేని చర్యలు, స్పష్టత కొరవడిన  విధానాలతో జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను అనతి కాలంలోనే మూటకట్టుకుందని సీనియర్ నేత, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ మాజీ మేయరు రాయపాటి మోహన్ సాయి కృష్ణ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన వివరాలు..
 
వై.సి.పి నాయకులు ఎవరు ఇష్టమెచ్చినట్లు వారు ప్రకటనలు ఇవ్వటం వలన ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇప్పటి వరకు 90 రోజుల పాలనలో ప్రధానంగా తొమ్మిది  అంశాలలో అనేక వర్గాల ప్రజలతో పాటు వై.సి.పి. అభిమానులు  సైతం ఇబ్బందుల్లో పడి అభద్రతాభావానికి, అయ్యోమయానికి  లోనవుతున్నారు. వై.సి.పి. కి యాభై శాతం ఓట్లతో, 151 ఎం.ఎల్.ఏ, 22 ఎం.పి. సీట్లతో రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని అందించారు.

జగన్ తోనే రాష్ట్రాభివృద్దికి బీజం పడుతుందని, మార్పుకి నాంది పలుకుతారని  ప్రజలు ఆశించారు. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రగతికి బాటలు వేస్తారని భావించారు. కాని వారి ఆశలను అడియాశలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజానీకానికి  మింగుడు పడకుండా వుంది.
 
1.రాజధాని అమరావతి, వరదలు :
మంత్రుల మాటలు వలన రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి. అలాగే మూడు నెలలుగా రైతులకు కౌలు చెల్లించలేదు. దీనితో అసలు రాజధానిని అమరావతిలో నిర్మిస్తారా లేక మరో చోటుకి తరలిస్తారా అనే సందేహం ప్రజలలో కలుగుతుంది.

రాజధానికి భూములు ఇచ్చిన వారికి స్థలాలు అభివృద్ధి చేసి ఇస్తామని ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి  అవినీతి జరిగి వుంటే చర్యలు తీసుకోవచ్చు. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా  ఉన్నప్పుడు రాజధానిని అమరావతి లో నిర్మించాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో సమర్ధించి ఇప్పుడు ఈ రకంగా పిల్లిమొగ్గలు వేయడంపై రెండు జిల్లాల ప్రజల్లో వ్యతిరేకతతో పాటు అసంతృప్తి వ్యక్తమవుతుంది.

తాజాగా కృష్ణానదికి వచ్చిన వరదలు సైతం రాజకీయ రంగు పులుముకొని ప్రభుత్వoపై  వ్యతిరేకతకు కారణమవుతోంది. ప్రకాశం బ్యారేజీ సామర్ద్యం 3 టీ.యం.సీ.లు. అయితే 4 టీ.యం.సీ.ల నీరు చేరే వరకు కిందకి నీటిని విడుదల చేయలేదు.

ప్రభుత్వం వుద్దేశపూర్వకంగానే  సామర్ధ్యానికి మించి నీటిని నిల్వ చేసి, నది ఒడ్డున వున్నమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిని ముంచి తద్వారా రాజధానికి అమరావతి అనుకూలం కాదని అపోహలు సృష్టించి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

దీని వలన లక్షలాది మంది ప్రజలు ముంపుకి గురయ్యారు. అసలు వరద ముంపుకి గురైంది బ్యారేజ్ దిగువున్న ప్రాంతం మాత్రమే. కాని ఎగువ ప్రాంతం ముంపుకి గురైనట్లు ప్రచారం చేసారు.  నిర్వహణాలోపం వల్ల ప్రజల్లో  వ్యతిరేకభావం ఏర్పడింది.
 
2. పి.పి.ఎ.లు :
గత ప్రభుత్వo ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలలో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయాలనుకోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేక భావం కలగడానికి కారణమవుతుంది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న నాటికి అంతకన్నా తక్కువ రేటుకి ఎవరైనా ఇస్తామన్నా, లేదా ఇతర రాష్ట్రాలలో అంతకన్నా తక్కువకు లభ్యమవుతున్నా, ఇక్కడ అవినీతి జరిగిందని నిర్ధారించుకున్నా దీనిపై చర్యలు తీసుకోవచ్చుగాని నాటి నిబంధనల , రేట్లకు సంబంధించి సక్రమంగా వ్యవహరించినపుడు ఒప్పందాలను రద్దు చేయడం పై తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటుంది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. దీనివల్ల భవిష్యత్ లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు, పారిశ్రామిక వేత్తలు  భయపడే పరిస్థితి వచ్చింది.
 
3. పోలవరం :
ఎంతో ప్రతిష్టాత్మకoగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని అందరికి తెలిసిందే. ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి జరిగితే ఖచ్చితంగా సదరు కాంట్రాక్టర్ పై, అప్పటి నాయకుల పై చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాని ప్రాజెక్ట్ భవిష్యత్ నే ప్రశ్నార్ధకం చేసేలా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు.

గత పాలకుల మీద కోపంతో రాష్ట్రాన్ని సస్యశామలం చేసే ఇలాంటి ప్రాజెక్ట్ వ్యవహారంలో దుందుడుకు గా వ్యవహారించడం ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది. పోలవరం టెండర్ లు రద్దు చేయడం వల్ల నవయుగ  సంస్థ కోర్ట్ ను ఆశ్రయిoచింది. కోర్ట్ లో రోజుల తరబడి ఈ కేసులు నడవడం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు సాగక పోగా, నిర్మాణ వ్యయo పెరిగి ప్రాజెక్ట్ మరింత భారo అయ్యే పరిస్థితి తలెత్తింది.

దివoగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన తనయుడిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి పూనుకుoటారా లేదా ప్రాజెక్ట్ పనులు అటకెక్కిస్తారో అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
 
4. వాలంటీర్ల వ్యవస్థ : 
ప్రభుత్వసేవలు  ప్రజల ముంగిట్లో అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గ్రామ వాలంటీర్ల వ్యవ్వస్థ కూడా తీవ్ర విమర్శలు  పాలవుతోంది. గ్రామ వాలంటీర్ల విధులలో నిత్యావసర వస్తువుల్ని ఇంటింటికి వెళ్లి స్వయంగా అందించాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలోని సుమారు 30,700 మంది  రేషన్ డీలర్లు, వారి సహాయకులు  పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

 వస్తువుల్ని ప్యాకేజింగ్ చేయడానికి అయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. డీలర్లను స్టాక్ పాయింట్లుగా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటకి దీని పై స్పష్టత లేదు. దీంతో ఆయా వర్గాల్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
5. గ్రామ సచివాలయాలు ఏర్పాటు - ఉద్యోగుల నియామకం :  
ఒకేసారి లక్షకు పైగా  ప్రభుత్వద్యోగ నియామకాలు చేపట్టి ప్రభుత్వం సంచలనం సృష్టించినా, ఆయా శాఖలలో గతంనుంచి పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగుల పరిస్థితి ఏoటనే విషయంపై వివరణ లేకపోవడంతో వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ఉదా: ఇప్పటికీ ఆరోగ్యశాఖలో ఆశా వర్కర్లు, పశుసంవర్ధక శాఖలో గోపాల మిత్రాలు మొదలైనవారు పనిచేస్తున్నారు. వారి స్థానాలలో కొత్తగా నియమించే ఉద్యోగులు వల్ల వీరి పరిస్తితి అగమ్యగోచరంగా మారింది. మీసేవ కేంద్రాల పరిస్థితి  పై స్పష్టత లేదు,  దీంతో వాటిలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడ్డాయి.
 
6. ఇసుక :
వై.సి.పి. అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న అత్యంత దారుణమైన నిర్ణయం ఇసుకు సరఫరాన్ని  ఆపడం. నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చే విషయంలో నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుండడంతో ఇసుకకు కొరత ఏర్పడి రాష్ట్రంలో భవన నిర్మాణరంగం కుదేలై తీవ్ర సంక్షోభంలో పడింది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ అవినీతి చేశారనే ఉద్దేశoతో నూతన విధానం తీసుకురావాలని ప్రభుత్వం తలంచినది.

దీనివల్ల లక్షలాది మంది  భవననిర్మాణ కార్మీకులు బజారున పడ్డారు. వాటి అనుబoధ స్టీల్, సిమెంట్, ఇతర అనేక  వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చేదాకా పాత విధానాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో అదే విధంగా ఇసుక విధానంలో పాటించినట్లయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావం ఏర్పడుతుంది.
 
7. అన్నాక్యాంటీన్లు: 
అధికారంలోకి వచ్చీ రాగానే అత్యుత్సాహంతో పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్ల  బోర్డులు , భవనాల రంగులు మార్చేసారు. జూలై 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నాక్యాంటీన్ లను మూసివేసి పేదలు, కూలీలు, అన్నార్తుల కడుపు కొట్టి పెద్ద అపవాదుని మూటగట్టుకున్నారు. మద్యం అమ్మడం ఆపలేదు గాని, రూ.5 లకు అన్నం పెట్టడం ఆపేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. 
 
8. ప్రజావేదిక  : ప్రభుత్వ నిధులతో ప్రజవేదికను గతంలో కృష్ణా నది కరకట్ట దిగువన అక్రమంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మించారు. కానీ ప్రజావేదికను కూల్చడంతో రాష్ట్రంలో అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాన్ని  వై.సి.పి. కి ఓట్లు వేసిన వారే  వ్యతిరేకించారు.

ఇది ఆర్.సి.సి. నిర్మాణం కాదు. మరోచోటకి  తరలించే అవకాశం ఉన్న PEB నిర్మాణం. సచివాలయం దగ్గరలోకి తరలించి ఉంటే ప్రజలు హర్షించేవారు. కక్షపూరితంగా ప్రజావేదికని కూల్చిన సంఘటన ప్రజల్ని ఆలోచనలో పడేసింది.  భవనాన్ని తరలించే అవకాశం వున్నా  పూర్తిగా ధ్వంసం చేయడం ద్వారా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయి.
 
9. రైతు రుణ మాఫీ, యువనేస్తంపై నాన్చుడు:
రైతు రుణ మాఫీకి సంబంధించి 23 లక్షల మంది రైతులకు 4, 5 విడతల  రుణాలు, యువనేస్తం పధకానికి సంబంధించి 4 లక్షలకు పైగా నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి చెల్లించాల్సి వుంది. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పధకాలను పక్కన పెట్టేసారు.

ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులు, నిరుద్యోగులు ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పధకాలను కొనసాగిస్తారా , లేదా నిలిపివేస్తారా అనే స్పష్టత కొరవడింది. ఈ విషయంలో కూడా జగన్ ఏ ప్రకటనా చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో ఆయా వర్గాల్లో అయోమయంతో పాటు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వై.సి.పి. సుపరిపాలన అందిస్తుందని సామాన్య ప్రజలతో పాటు వేరే పార్టీ అభిమానులు కూడా భావించారు. కాని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అనాలోచిత ఆదేశాలు , అసందర్భ ప్రకటనలు, అధ్యయనం లేని నిర్ణయాలతో ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. తాజాగా ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు, ప్రభుత్వంలోని కొందరు పెద్దల వ్యాఖ్యలు, చేష్టల పట్ల ప్రజలతో పాటు సొంత పార్టీ అభిమానులు సైతం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

గత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని, వారి ఆశలను నీరు గార్చుతున్నట్టు అవుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాలనలో, నిర్ణయాలలో ఎలాంటి గందరగోళానికి, అయోమయానికి తావివ్వకుండా స్పష్టమైన వైఖరితో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం..శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు