Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రిమినల్ కేసులో న్యూస్ ఛానల్ రిపోర్టర్ రాఘవేంద్ర అరెస్టు

Advertiesment
క్రిమినల్ కేసులో న్యూస్ ఛానల్  రిపోర్టర్ రాఘవేంద్ర అరెస్టు
విజ‌య‌వాడ‌ , గురువారం, 25 నవంబరు 2021 (19:16 IST)
అక్షరం ముక్క రాని వాళ్ళ కూడా ఇటీవల కాలంలో పాత్రికేయ, మీడియా రంగంలో ప్రవేశం చేయడంతో సమాజంలో మీడియా పట్ల గౌరవం, ఆదరణ త‌గ్గిపోతోంది. రాజమండ్రి నగరంలో  అన్నపూర్ణమ్మపేటకు చెందిన 99 న్యూస్ టీవీ రిపోర్టర్ గా వ్యవహరిస్తున్న సింగంశెట్టి రాఘవేంద్ర అనే విలేకరి ఒక క్రిమినల్ కేసులో  అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు వెళ్ళాడు. 

 
ఈ కేసు వివ‌రాల‌ను రాజ‌మండ్రి పోలీసులు వివ‌రించారు. 2020 మార్చి 5న అన్నపూర్ణమ్మ పేటలో నల్ల రాజా చంద్రశేఖర్ అనే యువకుడిని బైక్ పైన అడ్డగించి, రాఘ‌వేంద్ర ఆయుధంతో దాడి చేశాడు. ఆ దాడిలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 133 / 20 20  అండర్ సెక్షన్3 41,323 గా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతుండడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ఆదేశాలతో వన్ టౌన్ పోలీసులు నిందితుడు రాఘవేంద్ర కోసం గత కొంత కాలంగా తీవ్రంగా గాలిస్తున్నప్పటికి దొరకడం లేదు. 
 

ఎట్టకేలకు రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన నిందితుడు రాఘవేంద్రని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఆయన రిమాండ్ విధించారు. దాంతో రాఘవేంద్రని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. విలేకరి ముసుగులో మీడియా ఐడి కార్డు తీసుకుని వృత్తిపరమైన అంశాలను పక్కన పెట్టి, బ్లాక్ మెయిలింగ్, దందాలకు పాల్పడటం, చిన్నచిన్న వ్యాపారులను బెదిరించటం, డబ్బులు డిమాండ్ చేయడం ఆ విలేక‌రి వృత్తిగా పెట్టుకున్నాడ‌ని స్థానికులు చెపుతున్నారు. అన్నపూర్ణమ్మ పేటలో టైలర్ గా జీవనం సాగిస్తున్న ఒక యువకుడుని రాయితో కొట్టి గాయపరిచిన కేసు నమోదై ఉంది. తన భార్య పై తనపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసిందని, తప్పుడు కేసులు పెట్టి విలేఖర్లు అందరినీ తప్పుదోవ పట్టించాడు. 
 

కరోనా మహమ్మారి సమయంలో బాధ్యతారహితంగా రోడ్డుపై ఇష్టానుసారంగా తిరుగుతూ విధి నిర్వహణలో ఉన్న త్రీటౌన్ సీఐ దుర్గా ప్రసాద్ పై ఎదురు తిరగడంతో, సిఐ తనదైన శైలిలో కోటింగ్ వేసి  188, 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు రాఘవేంద్రకు కోర్టు జరిమానా విధించింది. ఇది ఇలా ఉండగా పోలీస్ కటింగ్ వేసుకుని, ఖాకీ ఫ్యాంట్ వేసుకుని నగర శివార్లలో ప్రధాన రహదారులపై రాత్రివేళలో కాపు కాసి అమాయకులైన ప్రజలను వాహనదారులను అడ్డగించి పోలీసులమని బెదిరించి దందాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా క్రిమినల్ మనస్తత్వంతో, అతని పక్కన ఎవరైనా ఉంటే వారి ఫోన్ తీసుకుని, కన్ను మూసి తెరిచేలోపు ఆ ఫోన్ నుండి అసభ్య పదజాలంతో మెసేజ్ లు పెట్టడం వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి కేసులోనే ఒకసారి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందగా, అప్పటి సీఐ మారుతీరావు రాఘవేంద్ర ను  స్టేషన్ కు పిలిపించి కూర్చోబెట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 
 

కాతేరు గోదావరి గట్టు ఇసుక ర్యాంపుల్లో లారీ డ్రైవర్ లను కూలీలను డబ్బులు కోసం వేధించడంతో వేధింపులు భరించలేక వారు తనపై దాడి చేయగా, తప్పించుకుని తిరిగి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదు చేసిన ఘనుడు. విలేకరుల ముసుగులో అసలు వృత్తిపరమైన అంశాలను వదిలి కేవలం దందాలను చేస్తూ, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పక్క మండలాల్లో జిల్లా వ్యాప్తంగా దందాలను కొనసాగిస్తున్నఇలాంటివారిని నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయ‌ల‌సీమ‌లో అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం