బోగస్ పేరుతో రేషన్‌ కార్డులపై వేటు : జగన్ సర్కారు ప్లాన్..

మంగళవారం, 19 నవంబరు 2019 (16:41 IST)
నవ్యాంధ్రలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేసేందుకు ఈ నెల 20 నుంచి డిసెంబరు 20 వరకూ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. 'వైఎస్సార్‌ నవశకం' పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని తలపెట్టారు. 
 
నవరత్నాల పథకాలు ప్రతిఒక్క పేద వారికి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిలో నూతనంగా రేషన్‌ బియ్యం అందజేసేందుకు ఒక కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరోకార్డు, ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు. 
 
ఇందుకు ఐదు లక్షల వరకూ గరిష్ట పరిమితిని విధించారు. ప్రభుత్వ అధికారులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు కాకుండా, మిగతావారంతా రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉంటే ఈ కార్డు పొందవచ్చని అధికారులు తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా ఒక కారు ఉన్నా ఆరోగ్య శ్రీకి అర్హులే. 
 
వీటితో పాటు జగనన్న విద్యా దీవెన ద్వారా అమ్మఒడి, ఇతర స్కాలర్‌షిప్‌లు, నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణకు హాజరయ్యేలా ఈ కార్డును అందిస్తారు. జగనన్న వసతి దీవెన కార్డు ద్వారా ప్రభుత్వ వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు ఈ కార్డు అందిస్తారు. వీటితోపాటు ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమపథకాలకు అర్హులైన జాబితాలను కూడా ఈ సర్వేలో గుర్తిస్తారు.
 
 
సర్వే నిర్వహణకు ఈనెల 19లోగా గ్రామ, పట్టణ వాలంటీర్లకు శిక్షణివ్వాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులకు సూచించారు. విద్యా, వైద్య, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తుతం తెల్ల రేషన్‌ కార్డులు ప్రమాణికంగా తీసుకుంటున్నారు. బియ్యం తీసుకోకపోయినా చాలా మందికి తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయని బియ్యం కార్డులు విడిగా ఇవ్వడం వల్ల అవసరమైన వారే తీసుకుంటారని దీని వల్ల రేషన్‌ అక్రమ వ్యాపారానికి బ్రేక్‌ పడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 
 
అంతేగాక ప్రత్యేక సర్వే చేయడం వల్ల బోగస్‌ కార్డులు కూడా కొన్ని బయటపడతాయని కొంతమంది అధికారులు చెబుతుండగా సర్వే పేరుతో కొన్ని కార్డులు తొలగిస్తారన్న ప్రచారం కూడా ఉంది. తెల్లరేషన్‌ కార్డుదారుల్లో ఎవరైనా బియ్యం తీసుకోకపోయినా ఇతర సంక్షేమ పథకాల కోసం ఈ కార్డు కలిగి ఉంటున్నారని అందువల్ల వేర్వేరు అంశాలకు విడివిడిగా కార్డులు జారీ చేయడం వల్ల రేషన్‌ సబ్సిడీ కొంత మిగులుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 
 
ఈ సర్వేపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఆయా అంశాలపై మార్గదర్శకాలున వివరించారు. కానీ క్షేత్రస్థాయిలో సర్వేలో ఏమాత్రం లోపాలు చోటుచేసుకున్నా రాజకీయ అంశాలు మిళితమై అర్హులైన కొంత మంది పేదలకు నష్టం వాటిల్లే ప్రమాదమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో సర్వే ఎలా జరుగుతుందనేది వేచిచూడాల్సిందే?. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 6జీపై కన్నేసిన చైనా.. వైర్‌లెస్ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యం