ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఏమానా నీ అబ్బ జాగీరా... నాని.. ఏంది నీ భాష అంటూ మండిపడ్డారు. 150 సీట్లు వస్తే.. రాష్ట్రాన్ని ఏమైనా మీకు రాసిచ్చారా? ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారా? అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నెల్లూరులోని ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగింది. మాజీ మేయర్ షేక్ అబ్బుల్ అజీజ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో బీద ముఖ్య అతిథిగా మాట్లాడారు. మంత్రులు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని ఆక్షేపించారు. కొడాలి నాని చంద్రబాబుపై మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. మా ఇష్టం మేము ఏమి చెయ్యాలో అదే చేస్తాం.. అన్న రీతిలో వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. తిరుమల ఆలయానికి ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయని ఎంతటి వారైనా వాటిని పాటించాల్సిదేనన్నారు.
రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, కార్మికుల నుంచి ఎదురవుతున్న తిరుగుబాటును పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలకు తెరతీసిందని ఆయన మండిపడ్డారు. జూనియర్ ఎన్‌టీఆర్ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ సరికొత్త డ్రామా యాక్టర్‌గా అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. 2014, 2019 ఎన్నికలలో జూనియర్ ఎన్‌టీఆర్ ప్రచారం చేయలేదని.. అయితే వంశీ ఎందుకు పోటీ చేశారో ప్రజలకు చెప్పాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.