ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. నవ్యాంధ్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తొలగించి, ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా, వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. "జగన్ రెడ్డి గారు.. ‘మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు 'తెలుగు భాష తల్లినే' చంపేస్తున్నారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అని విజ్ఞప్తి చేశారు.
పైగా, తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన, భస్మాసురతత్వాన్ని సూచిస్తుంది. ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే అని పవన్ తన ట్వీట్‌లో గుర్తుచేశారు.