నెల్లూరు జిల్లా రెడ్లు రాజకీయాలను శాసించేవారు. వారు ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. అయితే, గత నాలుగుళ్లుగా సాగుతున్న వైకాపా పాలనతో విధ్వంస, అరాచక పాలనతో విసిగిపోయిన ఆ పార్టీకే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వెంకటగిరి, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజవర్గాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు రెడ్లు తిరుగుబాటుతో రాష్ట్రంలోని వైకాపా అరాచక పాలనకు మూడినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ఓటింగ్ సాకుతో మాట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (నెల్లూరు రూరల్)లను వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ ముగ్గురూ టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న క్రమంలో శనివారం వారు ఆ దిశగా స్పష్టత ఇచ్చారు.
శుక్రవారం అర్థరాత్రి ఆనం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి నెల్లూరుకు తిరిగొచ్చారు. చంద్రబాబు సూచనలతో శనివారం ఉదయం మాజీ మంత్రులు అమరనాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నెల్లూరులో ఆనం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తెలుగుదేశం పార్టీలోకి రమ్మని ఆహ్వానించగా.. ఇందుకు ఆనం సంతోషంగా అంగీకరిం చారు.
ఆ తర్వాత ఆనం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన ఆత్మకూరు నుంచి ఆరంభంకానున్న లోకేశ్ యువగళం పాదయాత్రకు హాజరై ఆ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఆత్మకూరులో పాదయాత్ర పూర్తయ్యాక తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని ప్రకటించారు.
అంతకుముందు అమరనాథ్ రెడ్డి, బీద రవిచంద్ర.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించారు. ఆ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర బాధ్యతలను పర్యవేక్షించే బాధ్యతను ఇటీవలే పార్టీలో చేరిన ఆయన సోద రుడు గిరిధర్రెడ్డికి అప్పగించారు. మరోవైపు.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఉదయం కడప జిల్లా బద్వేలులో లోకేశ్‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. టీడీపీలో చేరనున్నట్లు మీడియా ముందు ప్రకటించారు.
వైకాపాకు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. వీరి చేరికతో తెలుగుదేశం అనూహ్యంగా బలం పుంజుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల అనంతరం నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వ సమస్య ఉంది. ఇప్పుడు ఆనం రాకతో ఆ కొరత తీరినట్లయిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
రూరల్ నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రజల్లో పట్టు సంపాదించుకున్నారు. ఈయనకు సరితూగే నాయకుడు లేని లోటు టీడీపీని వెంటాడుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా కోటంరెడ్డి టీడీపీలో చేరడానికి సమ్మతించడంతో రూరల్ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇక ఉదయగిరిపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి రెండు దశాబ్దాలుగా పట్టు పెంచుకున్నారు. నాలుగు పర్యాయాలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ అధినాయకత్వం తన పట్ల వ్యవహరించిన తీరుకు తీవ్రంగా కలత చెందిన ఆయన.. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రకటించారు. సస్పెన్షన్ వేటు పడిన రోజు నుంచి ఇదే నినాదంతో ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా తన వర్గాన్ని సమీకరించుకుంటున్నారు. ఈయన కూడా టీడీపీలో చేరుతుండడంతో ఉదయగిరిలో టీడీపీ పట్టు మరింత బిగిసినట్లయింది.