జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో పోలీసులు బరితెగించారు. చిరు, బడా వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనదారులు, వ్యాపారులు, ఆటోవాళ్లు, రిక్షావాళ్లు, కూలీలు.. ఇలా ఎవరినీ పోలీసులు వదలడంలేదు. రౌడీలకంటే ఘోరంగా నడి రోడ్డుపై డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బాధితులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య అతి ప్రధాన సమస్యగా ఉంది. పగలు లారీలు, మరికొన్ని వాహనాలు రాకపోకలపై నిషేధం ఉంది. అయితే లారీలు, సరుకుల ఆటోలు నగరంలోకి వస్తున్నాయి. ట్రాఫిక్ తీవ్రంగా ఉండే రోడ్లలో అడ్డంగా నిలిపేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
పోలీసులు వాటిని నిలువరించాల్సిందిపోయి.. ఒక్కో వాహనం నుంచి వంద నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. రోడ్లపై చిరు వ్యాపారులను కూడా వదలడంలేదు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. షాపుల ఎదుట వాహనాలు అడ్డంగా ఉన్నాయంటూ వ్యాపారులను పిండేస్తున్నారు.
హోటళ్ల వంటి వారి వద్ద నెల మామూలు గుంజుతున్నారు. ఒక్కో ఆటోకు రోజుకు వంద, రిక్షాలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో పోలీసులు వస్తున్నారంటేనే జనం హడలిపోతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో సగం మామూళ్లకే సరిపోతున్నాయని సామాన్యులు బోరున విలపిస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.