ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు తేరుకోలేని షాక్ తగిలింది. ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టం కట్టారు. మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. శుక్రవారమే రెండు స్థానాల్లో విజయం ఖరారు కాగా, శనివారం పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. చివరి ఓటు లెక్కింపు వరకు హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు తుది ఫలితంలో వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి 7,543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఫలితాల వెల్లడి తర్వాత వైకాపా, టీడీపీ మధ్యల యుద్ధం మొదలైంది. ఈ ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని వైకాపా పెద్దలు చెబుతుంటే.. రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఫైనల్ ఫలితాల్లోనూ ఇది రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు జోస్యం చెబుతున్నారు.
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఫలితాలపై స్పందించారు. గతంలో 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ వై నాట్ 175 అని ఇపుడు జగన్ చెబుతుంటే వినాలని ఉందన్నారు. ఎమ్మెల్యీ ఎన్నికల్లో వైకాపాను తొక్కిపట్టి నార తీశారని ఆయన తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. పులివెందుల కోటకు బీటలు వారుతున్నాయన్నారు. త్వరలోనే ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా చేరుతాయని ఆయన అన్నారు.