చాలా చాలా అరుదుగా కొన్ని సన్నివేశాలు కంటికి కనిపిస్తుంటాయి. అలాంటిదే ఇది. కుమార్తెకు ఓ తండ్రి సెల్యూట్ చేశారు. ఇంతకీ కుమార్తెకు తండ్రి ఎందుకు సెల్యూట్ చేశారన్నదే కదా మీ సందేహం. ఇవిగో ఆ వివరాలు..
తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ డ్యూటీ మీట్ సోమవారం నుంచి జరుగుతోంది. ఈ సందర్భంగా డీఎస్పీగా పనిచేస్తున్న కుమార్తెను చూసి సీఐగా ఉన్న ఓ తండ్రి గర్వంగా సెల్యూట్ చేశారు. తిరుపతికి చెందిన శ్యాంసుందర్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా కల్యాణి డ్యామ్ పోలీసు శిక్షణ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
ఆయన కుమార్తె జెస్సీ ప్రశాంతి గుంటూరు డీఎస్పీగా విధులు నిర్వహిస్తోంది. రెండేళ్ల కిందట పోలీస్ శాఖలో చేరిన ఆమె గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా పోలీస్ డ్యూటీ మీట్ సన్నాహాల్లో దర్శనమిచ్చి అందరినీ ఆకర్షించారు. కుమార్తె డీఎస్పీ కావడంతో ఆమెను తన పై అధికారిణిగా గుర్తించి తండ్రి సెల్యూట్ చేయడం అందరినీ అలరించింది.
తండ్రి తనకు సెల్యూట్ చేయడంతో డీఎస్పీ హోదాలో ఉన్న జెస్సీ ప్రశాంతి తిరిగి సెల్యూట్ చేశారు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ దృశ్యం తాలూకు ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కుమార్తెను డీఎస్పీ హోదాలో నిలిపిన సీఐ శ్యాంసుందర్‌ను అభినందించారు. ఓ మహిళ అయినా పోలీసు ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరిన జెస్సీని కొనియాడారు.