వృత్తికే అంకితమైన విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కొనియాడింది. ఇలాంటివారిని ఏపీ పోలీస్ శాఖ హీరోయిన్లుగా పోల్చింది. ఈ మేరకు ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.
తిరుపతి కేంద్రం సోమవారం నుంచి రాష్ట్రంలో మహిళల రక్షణ, సైబర్ భద్రత అంశాలపై పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆసక్తికర పోస్టు చేసింది.
'ప్రతి మహారాణి కిరీటం ధరించకపోవచ్చు, రాచరిక దుస్తుల్లో కనిపించకపోవచ్చు... కానీ కొందరు మహారాణులు టోపీలు పెట్టుకుంటారు, యూనిఫాం ధరిస్తారు. వీళ్లే మా హీరోయిన్లు... అత్యుత్తమ మహిళా పోలీసాఫీసర్లు' అంటూ కామెంట్ చేసింది.
ఈ వ్యాఖ్యలకు తగిన విధంగా కొందరు మహిళా పోలీస్ అధికారుల గ్రూప్ ఫొటోను కూడా పంచుకుంది. వృత్తికే అంకితమై విధులు నిర్వర్తిస్తున్న అధికారిణులు అంటూ ఏపీ పోలీస్ విభాగం కొనియాడింది. ఏపీ పోలీస్ ఎంతో భద్రమైన సేవలు అందిస్తూ, గర్వించదగ్గ రీతిలో పనిచేస్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.