ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ దాడులపై అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, విపక్ష నేతలు అయితే, దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ దాడులపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే దేవాదాయశాఖ ప్రతిష్ఠ దిగజారుతుందని స్పష్టం చేశారు.
రామతీర్థం ఘటనపై తక్షణమే నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితిని విధించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇప్పటివరకు వాస్తవాలను వెలికితీయడంలో పోలీసులు విఫలమయ్యారని స్వరూపానందేంద్ర విమర్శించారు.
కాగా, గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు, విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. వీటివల్ల దేవాదాయ ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోంది. పైగా, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోంది.
తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికివేత వీటికి పరాకాష్టగా చెప్పాలి. ఈ పరిణామాలపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తనను కలిసిన సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర రామతీర్థం అసహనం వ్యక్తం చేస్తూ, నిజ నిర్ధారణ కమిటి వేయాలని కోరారు.