ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశిలో అరుదైన దృశ్యం ఒకటి కనిపించింది. ఓ హిందూ బాలిక అంత్యక్రియల్లో ముస్లిం యువకులు పాలుపంచుకున్నారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
వారణాశికి చెందిన 19 యేళ్ళ సోని అనే హిందూ మతానికి చెందిన బాలిక... గత కొంతకాలంగా మలేరియా వ్యాధితో బాధపడుతూ గత ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఆమె ఇంటి పక్కనే ముస్లింలు కూడా నివసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది యువకులు.. సోని ఇంటికి వచ్చి.. అంత్యక్రియల్లో పాలుపంచుకున్నారు.
అంతేకాకుండా సోని మృతదేహాన్ని పాడెపై కట్టి.. తమ భుజాలపై మణకర్ణిక శ్మశాన ఘాట్‌కు మోసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేశారు. అంతేకాకుండా, మృతురాలి కుటుంబానికి కూడా వారు కొంత నగదు కూడా సహాయం చేశారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఒకరైన షకీల్ మాట్లాడుతూ.. ఇదే నిజం. జీవితం అంటే ఇది. కానీ, చిన్నచిన్న విషయాలకు గొడవపడుతుంటాం అంటూ చెప్పుకొచ్చారు.