వెస్ట్ గోదావరి జిల్లా పెంటపాడు మండలం, రావిపాడు ఎంటీపీసీకి జరిగిన ఎన్నికల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. జనసేన తరపున అభ్యర్థి లేకున్నప్పటికీ... ఆ గ్రామస్తులంతా కలిసి ఆ పార్టీని గెలిపించుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయభేరీ మోగించింది. కానీ పలు ప్రాంతాల్లో అధికార పార్టీకి విపక్ష పార్టీల అభ్యర్థులు తేరుకోలేని షాకిచ్చారు.
అలాంటి వాటిలో రావిపాడు ఒకటి. జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన అభ్యర్థి రాత్రికి రాత్రే వైకాపాలో చేరిపోయాడు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేశాడు. ఊళ్లోని జనసేన పార్టీ కార్యకర్తలు దీన్ని జీర్ణించుకోలేకపోయారు.
అభ్యర్థి పోయినా.. పార్టీని గెలిపించుకుందామంటూ ఎన్నికల ప్రచారం చేశారు. వారిదేం ప్రచారంలే... అధికార పార్టీదే విజయం.. అనుకున్నారంతా! కానీ ఆదివారం బ్యాలెట్ బాక్సులు తెరచి ఓట్లు లెక్కించాక అంతా నోరెళ్లబెట్టారు.
అభ్యర్థి లేకపోయినా.. జనసేన పార్టీనే విజయం వరించింది. పార్టీని వదిలి వెళ్లిపోయినా.. బొచ్చెల తాతారావే గెలుపొందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు ఎంపీటీసీ పదవి వద్దన్నా తాతారావునే వరించింది. వైసీపీ అభ్యర్థి ములగాల వెంకటేశ్వరరావుకు 859 ఓట్లు రాగా.. బొచ్చెల తాతారావుకు 937 ఓట్లు వచ్చాయి. 78 ఓట్ల ఆధిక్యంతో జనసేన గెలిచింది.