ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కొత్త మోటారు వాహన చట్టం 2019 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. వీటిని చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలతో రోడ్లపైకి రావాలంటే వణికిపోతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే చాలు.. వేలు, లక్షల్లో చలాన్లు రాస్తున్నారు.
దీంతో ఈ కొత్త మోటారు వాహన చట్టంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఫైన్ల విషయంలో అలోచించి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం కూడా వాహనదారులకు ఈ జరిమానాలు విషయంలో రిలీఫ్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించే యోచనలో ప్రభుత్వం లేదని సమాచారం.
కొత్త మోటారు వాహన చట్టం, జరిమానాలు గురించి తొలుత ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కార్ యోచిస్తోందట. అంతేకాకుండా ఈ భారీ ఫైన్లపై సమగ్ర అధ్యయనం జరిపి ఆమోదయోగ్యమైన జరిమానాలు సూచించాలని రవాణా అధికారులను జగన్ ఆదేశించారని సమాచారం. ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కసరత్తులు చేసిన ఈ బృందం తమ నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రవాణ అధికారుల కమిటీ సూచించిన జరిమానాలు:
రోడ్డు నిబంధన అతిక్రమిస్తే రూ.250 (కేంద్రం రూ.500)
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2500 (కేంద్రం రూ.5000)
అర్హత లేకుండా వాహనం నడిపితే రూ.4000 (కేంద్రం రూ.10,000)
ఓవర్ సైజ్డ్ వాహనాలు రూ.1000 (కేంద్రం రూ.5000)
రాష్ డ్రైవింగ్ రూ.2500 (కేంద్రం రూ.5000)
డ్రంక్ అండ్ డ్రైవ్ రూ.5000 (కేంద్రం రూ.10,000)
సీట్ బెల్ట్ రూ.500 (కేంద్రం రూ.1000)
ఇన్సూరెన్స్ లేకుంటే రూ.1250 (కేంద్రం రూ.2000).