Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరింత మందికి ‘వైయస్సార్‌ చేయూత’.. అర్హులైన ప్రతి మహిళ చేతిలో నాలుగేళ్లలో రూ. 75వేలు

Advertiesment
YSR Cheyootha
, గురువారం, 16 జులై 2020 (06:09 IST)
మహిళల ఉపాధిమార్గాలను మెరుగుపరచడం, తద్వారా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వైయస్సార్‌ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నిర్ణయించారు.

సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళల కష్టనష్టాలను పరిగణలోకి తీసుకున్న సీఎం– ఇప్పటికే వైయస్సార్‌ పెన్షన్‌కానుక కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న వారికీ వైయస్సార్‌ చేయూత కింద నాలుగేళ్లలో రూ.75వేల రూపాయలు అందించాలని నిశ్చయించారు.

ఈ కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి మానవీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 8.21 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.

తాజా నిర్ణయం కారణంగా పెన్షన్‌ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ వైయస్సార్‌ చేయూత ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూర్చనున్నారు.
 
మహిళలకు జీవనోపాథి మార్గాలను కల్పించడం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడంద్వారా వారి జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు ‘‘వైయస్సార్‌ చేయూత’’ద్వారా ఆదుకుంటామని గత ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ హామీ ఇచ్చారు.

ఎస్టీ,ఎస్సీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు 45 ఏళ్లనుంచి 60ఏళ్లలోపు ఉన్నవారందరికీ కూడా ఈ పథకం కింద అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75వేలు వారి చేతిలోపెట్టనున్నట్టు ప్రకటించారు.

ఈ హామీకి కట్టుబడి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  జూన్‌ 28 నుంచి లబ్ధిదారులనుంచి దరఖాస్తులను తీసుకుంటోంది.

ఇదిలా ఉండగా...వివిధ వర్గాలకు చెందిన మహిళలకు 60ఏళ్లలోపు ఉన్నవారికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. వీరిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీతకార్మికులు, మత్స్యకార మహిళలూ ఉన్నారు.

వీరు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నేపథ్యంలో మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వర్గాలకు చెందిన మహిళకు మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టంచేశారు.

ఆర్థికంగా భారమైనప్పటికీ వారికి వైయస్సార్‌ చేయూత కింద ప్రయోజనాలను అందించాలని, ఆమేరకు వారినీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టారు. వైయస్సార్‌ చేయూత విస్తరణకు కేబినెట్‌ ఆమోదం వేసింది.

తాజా నిర్ణయం వల్ల దాదాపుగా 8.21 లక్షలమంది మహిళలకు వైయస్సార్‌ చేయూత కారణంగా ప్రయోజనం చేకూరనుంది. 

ఏడాదికి రూ. 1540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది. మహిళల ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలను పెంచడంలో ఈ స్కీం ఉపయోగపడుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎంపీలు.. ఎందుకో తెలుసా?