ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జవాను సాయి తేజ కుటుంబాన్ని పరామర్శించారు. కురబలకోట మండలం ఎగువరేగడకు చేరుకున్న మంత్రి పెద్దిరెడ్డి సాయి తేజ కుటుంబ సభ్యులను కలుసుకుని జవాను మృతికి సానుభూతిని తెలియజేశారు. జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం జగన్ రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎంవో కార్యాలయం ప్రకటించింది.
ఈ మధ్యాహ్నం బెంగళూరుకు సాయితేజ మృత దేహం చేరుతుంది. రేపు ఆదివారం ఉదయం ఎగువరేగడకు సాయితేజ పార్థీవ దేహం చేరుకునే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించిన ఆర్మీ అధికారులు స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో సాయి తేజ భౌతిక కాయాన్ని అధికారులు తరలిస్తున్నారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఎగువ రేగడ పల్లి గ్రామానికి సాయి తేజ భౌతికకాయాన్ని తరలించనున్నారు. అధికార సైనిక లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు.