Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోరు అదుపులో పెట్టుకో: లోకేష్‌ కు మంత్రి కన్నబాబు వార్నింగ్

Advertiesment
నోరు అదుపులో పెట్టుకో: లోకేష్‌ కు మంత్రి కన్నబాబు వార్నింగ్
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:01 IST)
"పోలవరం ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకో. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించు. పద్ధతి మార్చుకో. సీఎం పై పిచ్చి విమర్శులు మానుకో లేకపోతే కచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు" అని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు టీడీపీ నేత నారా లోకేష్ కు వార్నింగ్ ఇచ్చారు.
 
ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...‘ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన తన పర్యటనలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటలు వింటుంటే అతడి ఆరోగ్యంపై అనుమానం వేస్తోంది. సాక్షాత్తూ గౌరవ సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడుతున్నాడు. అతడి మాటలు కొవ్వెక్కి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. అతడు ఒళ్లు మరిచి మాట్లాడుతున్నాడా’. 
 
‘రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ భాషలో విచక్షణ లేకుండా ఉండొద్దు. కనీస సంస్కారం కూడా లేకుండా లోకేష్‌ మాట్లాడుతున్నాడు. ఆయన అమెరికాలో చదువుకున్నా కనీస సంస్కారం లేదు. తండ్రి, కొడుకు ఇద్దరూ పూర్తిగా ఫ్రస్టేషన్‌లో మునిగిపోయి, ఒళ్లు మర్చిపోయి మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా, చాలా హీనమైన భాషను లోకేష్‌ మాట్లాడుతున్నాడు’.

‘పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు బొడ్డు కోసి మొదలు పెట్టినట్లు లోకేష్‌ మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి ఆ ప్రాజెక్టును ప్రారంభించింది రాజశేఖర్‌రెడ్డి గారు. ఆయనే దానికి అనుమతులు తీసుకువచ్చాడు. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం కాసులు కురిపించేదిగానే చూశాడు. దాన్ని ముందుకు తీసుకుపోలేదు. రాష్ట్రానికి వెన్నెముక అయిన ప్రాజెక్టును సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారు. నిర్ణీత వ్యవధిలో దాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు’.
 
‘లోకేష్‌ మీ మాటలను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలం అయింది. లేకపోతే 2019లో ఎన్నికల ఫలితాలు అలా రావు. సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడడం. వైసీపీ నాయకులను కుక్కలు అని సంబోధించడం ఏమిటిదంతా?. లోకేష్‌ను అలా వదిలేయకుండా ఎవరికైనా చూపించాల్సిన అవసరం ఉంది. తనకు తాను ఒక పెద్ద మాస్‌ లీడర్‌గా బిల్డప్‌ ఇవ్వాలని అనుకుని, ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు చదివి వినిపిస్తున్నారు. లోకేష్‌ నీవేమైనా మీ మామగారు అనుకుంటున్నావా’.
 
‘లోకేష్‌ నీకు పోలవరం గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే ఇలా పైపై మాటలు మాట్లాడి, సీఎం గారిని తిడితే జనం చూస్తారని అనుకుంటున్నావు. మీ పార్టీ లేనే లేదని మీ పార్టీ అధ్యక్షుడే స్వయంగా చెప్పాడు. అయినా సరే హైదరాబాద్‌లో ఉండి, అప్పుడప్పుడు వచ్చి ఇలా వచ్చి ఏదో మాట్లాడితే మీకు బాకా ఊదే పత్రికల్లో వస్తుంది’.
 
‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా నిర్వాసితుల గురించి ఆలోచించారా. అసలు మీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక ఇటుక అయినా ఎందుకు పెట్టలేదు. 2017 వరకు ఆ ప్రాజెక్టును ముట్టుకోకుండా వదిలేశారు. కక్కుర్తితో కమిషన్ల కోసం ప్రాజెక్టు కడతామని కేంద్రం కాళ్ల మీద పడి తెచ్చుకున్నారు. మరి 2017 వరకు ఆ ప్రాజెక్టును ఎందుకు కట్టలేదు’.

‘ఏం పీకుతున్నారు? అంటావా. 2017 వరకు ఆ ప్రాజెక్టును మీరు ఎందుకు పట్టించుకోలేదు. ఆ ప్రాజెక్టు మీ చేతికి వచ్చే వరకు కనీసం ఒక్క పనైనా చేశారా?. ఆనాడు మీరు నిర్వాసితుల గురించి పట్టించుకున్నారా. ఆ సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా. పిచ్చిగా మాట్లాడడం. చీకటి ఒప్పందం చేసుకుని కేవలం ప్రాజెక్టులో కమిషన్ల కోసం ప్రాజెక్టును తాకట్టు పెట్టింది చంద్రబాబు. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇప్పుడీ పర్యటనలు. విమర్శలు’.
 
‘నీ మాటలకు మేము బదులివ్వాలనుకుంటే ఇంకా మాట్లాడగలం. కానీ మాకు విచక్షణ ఉంది. సంయమనం పాటిస్తున్నాం. మా నాయకుడు కూడా అదే చెబుతున్నారు. రాజకీయ విమర్శలు చేయండి. వాటికి మేము సమాధానం చెబుతాం’.
 
‘పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కట్టలేదు. కానీ ఆ ప్రాజెక్టు చరిత్రలో రాజశేఖర్‌రెడ్డి గారు చిరస్థాయిగా నిల్చిపోయారు. 2004 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఆనాడు పోలవరం కట్టాలని చంద్రబాబుగారికి ఎందుకు ఆలోచన రాలేదు. జనం కోసం పోరాడితే ఏం పీకుతారు అని లోకేష్‌ అంటున్నాడు. జనం మిమ్మల్ని 2019లోనే పీకేశారు. చివరకు నిన్ను మంగళగిరిలో నిన్ను కూడా ఓడించారు.మా సీఎం గారు గేట్లు తెరిస్తే మీ పార్టీలో మీ నాన్న తప్ప ఒక్కరు కూడా మిగలరు. కాబట్టి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు’.
 
‘నీవు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో బహుషా తొలిసారి పర్యటిస్తున్నట్లున్నావు. కానీ మేము అక్కడ పుట్టి పెరిగాం’.
‘తూర్పు గోదావరి జిల్లా మన్యంలో ఏటపాక మండలంలో కాళ్ల వాపుతో గిరిజనులు చనిపోతుంటే విపక్షనేతగా ఉన్న జగన్‌గారు, అక్కడ పర్యటించి వారిని ఓదార్చి ఆర్థిక సహాయం చేశారు. అప్పుడు నీవు, మీ తండ్రిగారు ఎక్కడ ఉన్నారు?

చాపరాయి అనే మారుమూల గిరిజనులు అంతు పట్టని వ్యాధితో 17 మంది గిరిజనులు చనిపోతే, అధికారంలో ఉన్న మీరు పట్టించుకోలేదు. కానీ విపక్షనేతగా ఉన్న జగన్‌గారు, అక్కడికి వెళ్లి, వారిని పరామర్శించారు. సహాయం చేశారు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నా, ఏం చేశారు. వారిని ఎందుకు పట్టించుకోలేదు. రాజవొమ్మంగి మండలంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువులు పెద్ద సంఖ్యలో చనిపోతే, విపక్షనేతగా ఉన్న జగన్‌గారు, అక్కడికి వెళ్లి, వారిని ఓదార్చి ఆర్థిక సహాయం చేసి వచ్చారు. మీరు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు’.
 
‘అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు అనే వారున్నారని కనీసం ఆలోచించారా. వారి గురించి ఏ మాత్రమైనా పట్టించుకున్నారా. ఇవాళ గిరిజనులు సీఎం వైయస్‌ జగన్‌ను ఎంతో నమ్మారు. అందుకే ఈ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లలో మీకు కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అయినా హరికథలు చెబుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించండి. జనం మిమ్మల్ని ఎందుకు ఛీకొట్టారన్నది బేరీజు వేసుకోండి. ఆ తర్వాత పోలవరం గురించి మాట్లాడండి’.
 
బయట తిరగలేవు:
‘ఇవన్నీ మీకు తెలియదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. సీఎం గారిని, మా పార్టీ వారిని తిడితే తమ సొంత ఛానళ్లు, పత్రికల్లో ఒక మహానాయకుడి మాదిరిగా చూపిస్తారు అని నీవు అనుకుంటున్నావు. నీవు మాట్లాడుతున్న భాషను ఒకసారి వీడియో వేసుకుని చూడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరు. సీఎం గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీవసలు బయట తిరగలేవు. గుర్తు పెట్టుకో’.

‘ఇవాళ ప్రజల హృదయాల్లో ఉన్న ముఖ్యమంత్రి. కోట్లాది ప్రజలకు ఎప్పటికప్పుడు సాయం చేస్తున్న ముఖ్యమంత్రి. నీకు ఏమైనా సమస్యలు కనిపిస్తే, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. అంతే తప్ప నోటికి ఏది వస్తే అదే పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు’.
 
ఆ పనులు కమిషన్ల కోసం కాదా?:
‘గోదావరిలో ప్రవాహం వస్తే, మళ్లించడం కోసం గత ప్రభుత్వం స్పిల్‌వే పూర్తి చేయకుండా, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేశారు. అవి ఎందుకు చేశారు. కమిషన్లు వచ్చే పనులనే ముందు చేశారు కదా.

అందుకే కదా ఇవాళ నిర్వాసితుల సమస్య వచ్చింది. అసలు కేంద్రం నుంచి ప్రాజెక్టును మేమే కడతామని ఎందుకు తీసుకున్నారు. కేవలం కమిషన్ల కోసమే కదా. మీ జేబులు నింపుకోవడానికే కదా. ఇవన్నీ చర్యలన్నీ ప్రజలు 5 ఏళ్లు సునిశితంగా గమనించారు కాబట్టే, మిమ్మల్ని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపారు’.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన