ప్రేమించి వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా జీవించారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. కానీ విధి వారి వదలిపెట్టలేదు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల్లోనే ఆమె ఈ లోకాన్ని వీడిపోయింది. తనకు తోడునీడగా ఉంటుందనుకున్న భార్య అర్ధాంతరంగా తనువు చాలించడంతో మనస్తాపానికి గురైన భర్త కూడా ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.
చివరికి ఎనిమిది రోజుల పసికందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయాడు. హృదయ విదారకరమైన ఈ సంఘటన విశాఖ, సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో ఇరుగుపొరుగు ఇళ్లళ్లో ఉంటున్న జలుమూరి శ్రావణ్‌కుమార్, అంబిక ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వీరిరువురూ వివాహం చేసుకున్నారు. అంబికకి అప్పటికే ఫిట్స్ వ్యాధి ఉంది. అనంతరం గర్భం దాల్చింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 6న ఫిట్స్ రావడంతో 9 నెలల గర్భిణి అయిన అంబికను నగరంలోని కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకి శస్త్రచికిత్స చేయగా పండంటి మగబిడ్డని ప్రసవించింది. ప్రసవ సమయంలో కూడా తీవ్రంగా ఫిట్స్ వచ్చింది. దీంతో రెండు రోజుల తర్వాత ఈ నెల 8న బుధవారం ఆమె మృతిచెందింది.
భార్య మృతిని తట్టుకోలేని శ్రావణ్‌కుమర్ అప్పటి నుంచి మనస్తాపానికి గురయ్యాడు. ఈ తరుణంలోనే ఆదివారం సాయంత్రం సింహగిరిపై గిరిజన కాలనీకి సమీపంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.