యువకుడిని మృత్యువు వెంటాడి మరీ కబళించింది. ట్రక్కు నడుపుతూ వెళ్లిన అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి.
చికిత్స పొంది రాత్రి సమయంలో ట్రక్కులోనే భోజనం చేస్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మొదట జరిగిన ప్రమాదంలో గాయాలతో బయటపడగా.. రెండో సారి జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన ఉమర్.. మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి ట్రక్కు నడుపుకుంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం వస్తున్నాడు. పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి మూలమలుపు వద్ద ట్రక్కును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రక్కు ముందు భాగం దెబ్బ తింది. ఉమర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం స్థానిక ఆస్పత్రిలో ఉమర్ చికిత్స పొందాడు. ప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న ట్రక్కు యజమాని మల్లికార్జున సున్నిపెంట నుంచి వచ్చారు. ఆయన, ఉమర్ కలిసి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటనా స్థలంలోనే ట్రక్కులో భోజనం చేస్తున్నారు.
ఈ సమయంలో మార్కాపురం నుంచి దోర్నాల వైపు వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉమర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.