Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు

‘సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు
, సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (08:21 IST)
వెనుకబడిన తరగతులకు (బీసీ) తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా చట్టాలు తీసుకువచ్చే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు అనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు జరిగాయని తెలిపింది.

ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా.. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించామని, కానీ బీసీలకు మాత్రం 1995 చట్ట సవరణను అనుసరించి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వివరించింది. 1995లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, 1991 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభా ఆంధ్రప్రదేశ్‌లో 39 శాతం మేర ఉందని తెలిపింది.

రాష్ట్ర విభజన తరువాత ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో బీసీ ఓటర్లు 48.13 శాతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అందువల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ మాత్రం తప్పుకాదని.. పైగా వారి జనాభా కన్నా తక్కువ రిజర్వేషన్లే కల్పించామని స్పష్టంచేసింది.

పైపెచ్చు కృష్ణమూర్తి కేసులో అధికరణ 243డి(6)కి భాష్యం చెబుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సర్కారు వివరించింది. అలాగే, నిర్ణీత కాల వ్యవధిలోపు పంచాయతీ, మునిసిపాలిటీల ఎన్నికలను పూర్తిచేయడం ప్రభుత్వాల రాజ్యాంగ విధి అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. 
 
స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు.. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్‌ దాఖలు చేశారు.  

 
ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నిధులివ్వదు :

‘పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ వృథా అవుతాయి. 2018–19, 2019–20 సంవత్సరాలకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ రూ.4,065.79 కోట్లు కేటాయించింది. ఇందులో మొదటి వాయిదా కింద రూ.858.99 కోట్లు విడుదలయ్యాయి.

పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంవల్ల రెండో వాయిదా విడుదల చేయలేదు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎన్నికలు నిర్వహించకుంటే అవి రావు. దీంతో పంచాయతీలు తీవ్రంగా నష్టపోతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయండి.’ అని ద్వివేది తన కౌంటర్‌లో కోరారు. 
 
రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది :
‘పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77, బీసీలకు 34 శాతం మొత్తం కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

50 శాతం రిజర్వేషన్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దాటొచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. విధాన నిర్ణాయక వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించడంవల్లే రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయి. గత పాతికేళ్లుగా రిజర్వేషన్లు 50 శాతం దాటుతూనే ఉన్నాయి. 
 
విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న తీర్పును రాజకీయాలకు వర్తింపచేయడానికి వీల్లేదు. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.’ అని ద్వివేది తన కౌంటర్‌లో వివరించారు.

అంత జనాభా ఉన్నా.. చట్ట ప్రకారమే నడుచుకున్నాం :
అలాగే, ‘ఎక్కువ ఓటర్లు ఉన్న వర్గాలకు వాస్తవ అధికారాన్ని నిరాకరిస్తే, అది నిజమైన ప్రజాస్వామ్యం కాదని కూడా ‘సుప్రీం’ తెలిపింది. దీని ప్రకారం జనాభాలో వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అందుకనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో చట్ట సవరణ జరిగింది.

ఎస్సీ, ఎస్టీలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తున్నప్పటికీ, బీసీలకు మాత్రం జరగడంలేదు. తాజాగా బీసీల జనాభాను తేల్చకుండా వారి రిజర్వేషన్లు తేల్చడం సరికాదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ, మేం బీసీల లెక్కలు తేల్చాం.

ఆ ఓటర్లు 48.13 శాతం ఉన్నప్పటికీ, చట్ట నిబంధనలకు లోబడి వారికి 34 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చాం’ అని గోపాలకృష్ణ ద్వివేది తన కౌంటర్‌లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది.. ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000