Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బడి రూపు మార్చేందుకు భాగస్వాములమవుదాం: మంత్రి ఆదిమూలపు

బడి రూపు మార్చేందుకు భాగస్వాములమవుదాం: మంత్రి ఆదిమూలపు
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (07:06 IST)
రాష్ట్రంలో నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని, కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు.

పాఠశాలల రూపు మార్చటం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న నాడు - నేడు కార్యక్రమంలో భాగస్వాములమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో పలువురు మంత్రులు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో ఈ కార్యక్రమంపై సమావేశం జరిగింది.

నాడు -నేడు పై వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ విద్యావ్యవస్థ లో తీసుకుంటున్న సంస్కరణలతో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నాడు - నేడు ను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. నూతన నిర్మాణ పనుల బాధ్యత పేరెంట్స్ కమిటీల ద్వారా జరుగుతుదన్నారు.

బిల్లుల చెల్లింపు కోసం చెక్ లపై ఫీల్డ్ ఇంజనీర్, ప్రధానోపాధ్యాయులు తో పాటు పేరెంట్స్ కమిటీ లోని  ముగ్గురు సభ్యులను బాధ్యులుగా చేస్తున్నామని వివరించారు. ప్రతి రూపాయికి లెక్క చూపే విధంగా పేరెంట్స్ కమిటీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు.అంచనాలు రూపొందించే ఇంజనీర్లు కూడా పాఠశాలల లైఫ్ 75 సంవత్సరాలు ఉండే విధంగా డిజైన్ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు.

మొదటి  విడతగా రాష్ట్రం లో 15, 715 పాఠశాలలను ఎంపిక చేయగా అందులో ప్రకాశం 1406, పశ్చిమ గోదావరి 1148, కృష్ణా 1112, గుంటూరు జిల్లాలో 1216 పాఠశాలలు ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ధి చేసే మొత్తం 9 అంశాలను మంత్రి సురేష్ వివరించారు. రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా స్థాయి లో కలెక్టర్ చైర్మన్ గా కమిటీ ఉంటుందని తెలిపారు.

పాఠశాలల అభివృద్ధి లో దాతల సహకారం కూడా తీసుకుంటామన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు ఉపాధిహామీ నిధులతో అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు, సలహాలు, సూచనలను మంత్రులు, ఎమ్మెల్యే లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైన విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి సురేష్ చెప్పారు.

సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత, పేర్ని నాని, రంగనాథరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 నుంచి విశాఖలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు