పోలీస్ జులుం ప్రదర్శించి పరాయి వ్యక్తి స్థలాన్ని ఆక్రమించుకుని కంచె వేయడమే కాకుండా, తనకు అడ్డు చెప్పిన వారిపై ఒక ఏఆర్ కానిస్టేబుల్ పెప్పర్ స్ప్రే చల్లి.. కత్తితో దాడి చేసిన ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గవరవరంలో జరిగింది. భూముల సరిహద్దు వివాదంలో తాహశీల్దాద్రు సక్షమంలోనే ఏఆర్ కానిస్టేబుల్ ఈ దాడికి తెగబడటం గమనార్హం.
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. గవరవరం రెవెన్యూ గ్రామ పరిధిలో జి.జగన్నాథపురం గ్రామానికి వెళ్లే దారిలో సర్పంచి చప్పగడ్డి మాణిక్యం కుమార్తె జొన్నపల్లి చిన్నతల్లికి చెందిన సుమారు 45 సెంట్ల భూమి ఉంది. ఇందులోకి ఏఆర్ కానిస్టేబుల్ వంకల అప్పలనాయుడు ఈమె భూమిలోకి చొచ్చుకొని వచ్చి కంచె వేశారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు తహశీల్దారు తిరుమలబాబు, వీఆర్వో రమణమూర్తి, సిబ్బంది వెళ్లి ఇరువర్గాలను విచారణ చేశారు.
రెవెన్యూ సిబ్బంది భూమి వివరాలు అడుగుతున్న సమయంలో కానిస్టేబుల్ పెప్పర్ స్ప్రే చల్లి చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో అందివచ్చిన వారినల్లా గాయపరిచి హల్‌చల్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలకు చెందిన 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చప్పగడ్డి దేముడునాయుడు ఫిర్యాదు మేరకు వంకల అప్పలనాయుడు, ఉప్పల అప్పారావు, లక్ష్మణ, నాగరాజు, బాలిబోయిన వెంకటరత్నంపై కేసు నమోదు చేయగా, వంకల అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు చప్పగడ్డి అర్జున్, చప్పగడ్డ అప్పలనాయుడు, దేముళ్లునాయుడు, జొన్నపల్లి వెంకటరమణ, మజ్జి రమణ, ఎరుకునాయుడు, అప్పలస్వామి తదితర 12 మందిపై కేసు నమోదు చేశామన్నారు. గాయపడిన వారిని చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు వివరించారు.