హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలతో పాటు కోతులు సంచారం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇవి ఒంటరిగా వెళుతున్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో కోతులు కూడా రెచ్చిపోతున్నాయి.
ఆహారం కోసం జనసంచార ప్రాంతాల్లోకి వచ్చి స్వైర విహారం చేస్తున్నాయి. వాటిని అడ్డుకునే వారిపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా, వీధుల్లో ఒంటరిగా వెళ్లేవారితో పాటు.. స్కూలుకు వెళ్లే విద్యార్థులపై కూడా దాడులు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు భద్రాచలంలో కూడా ఎక్కడ చూసినా ఈ కోతుల బెడద అధికమైపోయింది. ఈ వానరాల గుంపుతో భద్రాచలంతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కోతుల బెడద నుంచి అటవీ శాఖ అధికారులు రక్షించాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.