కరోనా రోగులకు తక్షణం స్వస్థత చేకూర్చే కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందు పనితీరుపై తిరుపతి ఆయుర్వేద వైద్య కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలు అధ్యయనం చేశాయి. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్‌లైన్‌లో సమర్పించాయి.
ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కేంద్ర పరిశోధన సంస్థ ఈ మందుపై తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలావుంటే, వారం రోజుల అజ్ఞాతం తర్వాత ఆనందయ్యను ఇంటివద్దకు పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున మళ్లీ అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు.
మరోవైపు, ఆనందయ్య నిర్బంధంపై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తలోజి తీవ్రంగా స్పందించారు. ఆయనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం కృష్ణపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆచారి.. కుటుంబ సభ్యుల నుంచి ఆనందయ్యను దూరం చేయడం దారుణమన్నారు. ఆనందయ్య మందును ప్రసాదంలా అందరికీ పంపిణీ చేసేలా జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆనందయ్యను నిర్బంధించిన వారిపై బీసీ కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.