Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్‌–19 ఒక జ్వరం వంటిదే: జగన్‌

Advertiesment
కోవిడ్‌–19 ఒక జ్వరం వంటిదే: జగన్‌
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:11 IST)
కరోనా సోకిన వారిపై వివక్ష చూపకుండా, వారిని ఆదరించాలని.. వారు కూడా మన నుంచి కోరుకునేది ప్రేమ, ఆప్యాయత మాత్రమే అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

104 నెంబరుకు ఫోన్‌ చేస్తే చాలని, వైద్యులు వచ్చి చికిత్స చేస్తారని, పరిస్థితిని బట్టి అవసరమైతే ఆస్పత్రుల్లో చేర్పిస్తారని, ఔషథాలు కూడా ఇస్తారని ఆయన తెలిపారు.

కరోనా నియంత్రణకు ఏ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, వైరస్‌ సోకిన వారిని గుర్తించడం.. చికిత్స చేయడం వరకు అన్నింటిలోనూ ఒక సమగ్ర విధానంతో పనులు చేస్తోందని సీఎం వెల్లడించారు. రెండు రోజుల నుంచి కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని, ఇది బాధాకరమని అన్నారు. ఢిల్లీలో సదస్సుకు వెళ్లిన వారితోనే ఈ సమస్య వచ్చిందన్న ఆయన, వారందరిని గుర్తిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, వాటిలో 70 కేసులు ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన వారికి సంబంధించినవే అని తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అందు కోసం 104 నెంబరుకు ఫోన్‌ చేస్తే చాలని చెప్పారు. 
 
కోవిడ్‌–19 వైరస్‌ నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసు నుంచి మరోసారి మాట్లాడారు.
 
సమగ్ర విధానంతో చర్యలు
కరోనా వైరస్‌ నియంత్రణకు ఏ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, వైరస్‌ ఉన్న వారికి గుర్తించడంతో పాటు, వారికి చికిత్స అందించడంలో కూడా ఒక సమగ్ర విధానంతో చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు. 
 
కేసులు పెరగడం బాధాకరం
గత రెండు రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని సీఎం చెప్పారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో చాలా మంది విదేశీయులు పాల్గొన్నారని, అక్కడికి వెళ్లిన మన వారికి వైరస్‌ సోకిందని చెప్పారు. అందుకే ప్రభుత్వం చాలా ముమ్మరంగా, ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరిని, వారితో ప్రయాణించిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్న వారికి, కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించే కార్యక్రమం గట్టిగా చేస్తోందని తెలిపారు.

ఈ వైరస్‌ ఒక సిగ్మా మాదిరి.. అది వస్తే ఏదేదో జరిగిపోతుందని ఎవరూ అనుకోవద్దని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వైరస్‌ కూడా దాదాపు ఒక జ్వరం, ఫ్లూ వంటిదే అని పేర్కొన్న ఆయన, కాకపోతే వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిపై వైరస్‌ కాస్త ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పారు. కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్‌ మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి, దేశ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్‌ రావడం, ఆ తర్వాత వారు చికిత్స పొంది బాగు కావడం కూడా చూశామని గుర్తు చేశారు.
 
ఢిల్లీ సదస్సుతో..
‘ఢిల్లీలో ఒక సమ్మేళనం జరిగింది. అక్కడికి విదేశీయులు రాగా, వారి నుంచి వైరస్‌ సోకింది. ఆ సమ్మేళనానికి ఇక్కడి నుంచి హాజరైన వారికి కూడా వైరస్‌ సోకింది’ అని సీఎం పేర్కొన్నారు. ‘ఇప్పుడు రాష్ట్రంలో గుర్తించిన 87 పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 70 కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే. రాష్ట్రం నుంచి దాదాపు 1085 మంది ఢిళ్లీ వెళ్లగా, వారిలో 585 మందిని పరీక్ష చేయగా, వారిలో 70 పాజిటివ్‌గా వచ్చాయి. మరో 500 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా 21 మంది జాడ తెలియడం లేదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
 
కాబట్టి వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, లేదా తెలిసిన వారు కానీ, వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారు కానీ ఉంటే, వారంతట వారే 104 కు ఫోన్‌ చేసి, స్వయంగా పరీక్ష చేయించుకోవాలని కోరారు.
 
‘ప్రతి ఇంటికి కూడా.. గ్రామ వలంటీర్, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, స్థానికంగా ఉన్న రిసోర్స్‌ పర్సన్లు సర్వే చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా, జ్వరంగా ఉన్నా, శ్వాసకోశ సంబంధ సమస్యలున్నా ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పండి. వెంటనే మీకు వైద్యం అందుతుంది’.

‘81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకుని నయమయ్యారు. వైద్యం పొంది ఒక 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటే చాలు. ఏ సమస్య ఉండదు. కేవలం 14 శాతం మాత్రమే ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా, వారిలో కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఐసీయులో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఎవరికి బాగా లేకున్నా, సర్వే కోసం వచ్చినప్పుడు చెప్పండి’.

‘వెంటనే మీకు వైద్యం అందించడమే కాకుండా, అవసరమైన మందులు ఇస్తారు. మీకు తోడుగా ఉంటారు. ఇంకా అవసరమైతే ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం అందేలా చూస్తారు. కాబట్టి ఏ మాత్రం మొహమాటం లేకుండా మీ అనారోగ్య సమస్యలు చెప్పండి.

ఇలా చెప్పడం వల్ల మనకు కలిగే మేలు ఏమిటంటే.. మీతో పాటు, కుటుంబ సభ్యులు, పొరుగు వారికి కూడా మేలు జరుగుతుందని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 
మీరూ కలిసి రండి
‘ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, వైద్యులు, నర్సులు.. మీరంతా కూడా ఇన్‌వాల్వ్‌ కావాలని కోరుతున్నారు. ఇప్పటికీ మీరు ఎన్‌రోల్‌ చేయించుకోకపోతే.. 104 కు ఫోన్‌ చేసి మీ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా మీరు మనస్ఫూర్తిగా ముందుకు రావాలని కోరుతున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
‘రాష్ట్రంలో ఈ కరోనా దాడి వల్ల ఆదాయం పూర్తిగా మందగించిన పరిస్థితి. మరోవైపు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తోడ్పాటు అందించడంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అనుకోని ఆర్థిక భారం చాలా పడింది’.

‘ఈ పరిస్థితుల్లో వేతనాలు పోస్ట్‌పోన్‌ చేసుకుని సహకరించిన అందరు ఉద్యోగులు, అందరు ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లు.. మీకు కష్టమనిపించినా సహకరించారు. అందుకు మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’ అని ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
 
భౌతిక దూరం పాటించండి
వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, రైతు కూలీలు, ఆక్వా రంగంలో ఉన్న రైతులు, రైతు కూలీలకు కొన్ని సలహాలు అన్న సీఎం,  అందరికీ ఒకటే విజ్ఞప్తి అంటూ..‘గ్రామాల్లో మీరు మధ్యాహ్నం 1 గంట వరకు మీ మీ పనులు చేసుకోండి. ఏ ఇబ్బంది లేదు. వ్యవసాయం చేసే రైతులు, రైతు కూలీలు, ఆక్వా రంగంలోని రైతులు, రైతు కూలీలు బతకాలి.

కాబట్టి ప్రభుత్వం ఎవరినీ ఆక్షేపించడం లేదు. కాబట్టి మీ మీ పనులు 1 గంట వరకు చేసుకోండి. కానీ, ఒక సూచన. మీరు మీ మీ పనులు చేసుకునేటప్పుడు కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించండి’. ‘ఆక్వా రంగంలోని ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ రంగానికి చెందిన ఆయిల్‌ మిల్లులు, పప్పు మిల్లులు, ఇతర యూనిట్లు ఎవరి పని వారు చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
 
కరోనా నయమవుతుంది
కోవిడ్‌–19 ఒక జ్వరం వంటిదే అని, మందులు తీసుకుని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటే తప్పనిసరిగా నయం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
 
వివక్ష చూపకండి. ఆదరించండి
‘కరోనా సోకిన వారిని వేరుగా చూడకండి. వారిని ఆదరించండి. మన కుటుంబంలో ఎవరికైనా సోకితే ఇంకా మంచిగా చూసుకోవాలి. వారిపై ఇంకా ఎక్కువ మానవత్వం చూపాలి. ఏ మాత్రం వివక్ష చూపవద్దు. కరోనా సోకిన వారు మన నుంచి ఆశించేది కాస్త ఆప్యాయత, ప్రేమ మాత్రమే’ అని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
 
ఇప్పటికే అన్ని చోట్ల కరోనా చికిత్సకు ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు కల్పించామని, ఐసొలేషన్‌ బెడ్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

‘మీరు చేయాల్సిందల్లా 104కి ఫోన్‌ చేయడం. ఆ వెంటనే వైద్యులు వస్తారు. చికిత్స చేస్తారు. అవసరమైతే ఆస్పత్రికి తరలిస్తారు. కాబట్టి కరోనా సోకిన వారిపై వివక్ష చూపకుండా, ఆదరించి, వైద్యం చేయించమని కోరుతున్నాను’ అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా అంతానికి చిలుకూరులో పాదుకా పట్టాభిషేకం