Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎక్కడివారు అక్కడే: జగన్

ఎక్కడివారు అక్కడే: జగన్
, గురువారం, 26 మార్చి 2020 (19:04 IST)
ప్రజలందరూ ఎక్కడివారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రావాళ్లను కూడా రాష్ట్రంలోకి అనుమతించలేకపోవడం బాధకలిగించిందని జగన్‌ వ్యాఖ్యానించారు.

ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండకపోతే కరోనాను నియంత్రించలేమని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో ఉన్న వారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉన్నప్పుడు ఎవరికైనా బాగోలేకపోతే గుర్తించడం సులభమవుతుందని అన్నారు.

రాబోయే మూడు వారాలు ప్రజలు ఎక్కడికీ కదలవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రజలనుద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ కరోనాలాంటి వైరస్‌ వందేళ్లకు ఓ సారి వస్తుందేమో. జీవితంలో ఒక జనరేషన్‌ ఒకసారి చూస్తారేమో. ఇలాంటి వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోలేకపోతే భావితరాలపై ఆ ప్రభావం పడుతుంది.
 
కేవలం క్రమశిక్షణతోనే మనం కరోనాను గెలవగలం. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలందరూ సహకరించాలి. నిన్న రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన సుమారు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచాం.

మానవతాదృక్పథంతో అనుమతించినా..14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాల్సిన పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు నేరుగా వారి ఊళ్లకు వెళ్తే.. మీ కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టినట్లే. ఇతర ప్రాంతాల్లో ఉన్న మనవాళ్లకు ప్రభుత్వం కచ్చితంగా అండగా ఉంటుంది.

అందరూ సమిష్ఠిగా పోరాడితేనే కరోనాను నియంత్రించగలం. విదేశాలకు వెళ్లి వచ్చినవాళ్లను 27,819 మందిని గుర్తించాం. మీ ఇళ్లల్లో మీరు ఉండటం చాలా అత్యవసరం. గ్రామవాలంటీర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఆశావర్కర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. స్వీయ నియంత్రణ చాలా అవసరం.

అందరూ సామాజిక దూరం పాటించాలి. నాలుగుచోట్ల కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. కోవిడ్‌ -19 ప్రత్యేక ఆస్పత్రుల్లో 450 ఐసీయూ బెడ్స్‌.. ప్రతి జిల్లాలో క్వారంటైన్‌ కోసం 200  ఐసోలేషన్ బెడ్స్‌.. ప్రతి నియోజకవర్గ పరిధిలో 100 బెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం.

80శాతం మంది ఇళ్లల్లో ఉండే కరోనాను ఎదుర్కొన్నారు. కేవలం 14శాతం మాత్రమే ఆస్పత్రులకు వెళ్లిన పరిస్థితి ఉంది. 4 శాతం మంది మాత్రమే ఐసీయూకు వెళ్లార’ని తెలిపారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి.. ఎలాంటి అవసరం ఉన్నా 1902కు ఫోన్‌ చేయండి. ప్రజలందరికి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.

ఏ గ్రామంలో ఉండేవారు ఆ గ్రామంలోనే ఉండండి.. ఏ జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లాలోనే ఉండండి.. ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోనే ఉండండి. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నాం. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులుంటే వెంటనే వాలంటీర్ల ద్వారా సచివాలయానికి సమాచారం అందుతుంది.

అలా గుర్తించిన వారికి ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశాలిచ్చాం. మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌లు, అధికారుల సమన్వయంతో పర్యవేక్షిస్తారు. సీనియర్‌ ఐఏఎస్‌ కృష్ణబాబు ఆధ్వర్యంలో 10మంది ఐఏఎస్‌లు 1902 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను పర్యవేక్షిస్తారు. 
 
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదు. ప్రతి 2, 3 కిలోమీటర్ల పరిధిలో రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ఉ.6 నుంచి మ.ఒంటిగంట వరకు నిత్యావసరాల కోసం బయటకు రావొచ్చు. పొలం పనులకు వెళ్లేవారు కూడా సామాజిక దూరం పాటించాలి.

గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని.. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలను ఆదేశించాం. ఏప్రిల్‌ 4న ప్రతి ఇంటికి రూ.వెయ్యి ఇస్తాం. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్టు.. ఆంధ్రప్రదేశ్‌లో "ఆల్ పాస్" నిర్ణయం