నూతన సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందు ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. అది శాసనసభ సంప్రదాయం. అయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రమాణ పత్రంలో ఉండే దైవ సాక్షిగా లేదా ఆత్మసాక్షిగా అని తప్ప వేరే ఏ ప్రస్తావన చేసినా ప్రమాణం చెల్లదు.
కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా, నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ అభ్యంతరం తెలిపి శ్రీధర్‌రెడ్డితో రెండోసారి ప్రమాణం చేయించారు. ఇక 2009లో ఇలాగే ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలతో తిరిగి ప్రమాణస్వకారం చేయించారు నాటి ప్రొటెం స్పీకర్.