Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి పదవి అడిగితే స్పీకర్‌ను చేస్తానంటున్న సీఎం జగన్.. పారిపోతున్న ఎమ్మెల్యేలు

మంత్రి పదవి అడిగితే స్పీకర్‌ను చేస్తానంటున్న సీఎం జగన్.. పారిపోతున్న ఎమ్మెల్యేలు
, శుక్రవారం, 31 మే 2019 (08:18 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయాన్ని సాధించింది. ఫలితంగా నవ్యాంధ్ర రెండో కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఆయన ఒక్కరే సీఎంగా ప్రమాణం చేశారు. ఇపుడు మంత్రివర్గ కూర్పుతో పాటు.. స్పీకర్ ఎంపికపై దృష్టిసారించారు. ముఖ్యంగా శాసనసభను సమర్థవర్థంగా నడిపే శక్తియుక్తులున్న నేతను స్పీకర్‌గా కూడా ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నారు. 
 
అయితే, స్పీకర్ పోస్టు అంటేనే వైకాపా ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. అయ్యబాబోయ్ ఆ పదవి మాకు వద్దు ప్రాధేయపడుతున్నారు. తమకు పదవి లేకపోయినా ఫర్లేదుగానీ, స్పీకర్‌గా మాత్రం ఉండబోమని తేల్చి చెబుతున్నారు. కొత్త ఎమ్మెల్యేలు అలా అనడానికి బలమైన కారణం లేకపోలేదు. 
 
ఏపీ శాసనసభ చరిత్రను ఓసారి పరిశీలిస్తే, సభాపతిగా పని చేసిన వారు రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సభాపతిగా పని చేసిన ప్రతిభా భారత్, సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందలేదు. వీరంతా ఓడిపోయినవారే. గత చరిత్రను తిరగేసినా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. దీంతో స్పీకర్ పదవి అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు. 
 
ఒకసారి స్పీకర్‌ పదవి చేపట్టిన వారు శాసనసభకు దూరమవుతూ వస్తున్న ఆనవాయితీ వారిని భయపెడుతోంది. తెనాలి నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలుపొందిన నాదెండ్ల మనోహర్‌ రెండోసారి విజయం సాధించిన తర్వాత తొలుత డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ పదవి చేపట్టిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటి చేసి ఓడిపోయారు. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 
 
ఇక తాజా మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుదీ అదే పరిస్థితి. నరసరావుపేట నుంచి వరుసగా ఐదుపర్యాయాలు గెలుపొందిన కోడెల హోంమంత్రి వంటి కీలక శాఖలను కూడా నిర్వహించారు. వైఎస్సార్‌ ప్రభంజనంలో 2004 - 2009లో ఓటమి పాలైనప్పటికీ తిరిగి 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి మళ్లీ శాసనసభలో అడుగు పెట్టగలిగారు. మంత్రి పదవి కోసం ఎంత ప్రయత్నించినా సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు స్పీకర్‌ పదవి ఇవ్వగా అయిష్టంగానే చేపట్టారు. 
 
ఇపుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సర్కారులో స్పీకర్ పదవిపై ఏ ఒక్క నేతా పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొలువుదీరిన "మోడీ 2.O" సర్కారు : భారీ సైజులో మంత్రివర్గం...