నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి చెందిన వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వరం పెంచారు. రూ.కోట్లు ఉంటే సరిపోవని, ప్రజల అభిమానం ఉండాలన్నారు. ముఖ్యంగా, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లాగా డ్రామాలు చేయడం తనకు తెలియదన్నారు. ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టే సమయంలో పారిపోయిన వ్యక్తి అని అన్నారు. వైకాపా అధిష్టానంపై తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన మంగళవారం నగరంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ, "2019 ఎన్నికల్లో తెదేపా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదాల.. నామినేషన్‌కు ముందురోజు వైకాపా కండువా కప్పుకున్నారు. ఇలాంటి వారా నన్ను విమర్శించేది? నెల్లూరు రూరల్‌లో రూ.200 కోట్లు, రూ.300 కోట్లు పెట్టి కోటంరెడ్డి సంగతి తేల్చేస్తామని కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారు.
2024 ఎన్నికల్లో తేల్చుకుందాం. ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలి కానీ, వందల కోట్లతో విజయం సాధించలేరు. కార్పొరేటర్ల సంఖ్య ముఖ్యం కాదు. ఎంతమంది ప్రజల మనసుల్లో ఉన్నామన్నదే ప్రధానం. కొందరు రాజకీయ నాయకుల్లాగా చివరిరోజు దాకా అధికార పార్టీలో ఉండి, ఆఖర్లో పార్టీ మారే స్వభావం నాది కాదు. అవమానించిన చోట ఉండలేక, ఇచ్చిన జీవోలకు కూడా నిధులు రాక, ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, విధిలేని పరిస్థితుల్లో బయటకు వచ్చాను. ప్రజలే న్యాయనిర్ణేతలు. 2024లో ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తా. ఓ సైనికుడిలా పనిచేస్తా" అని కోటంరెడ్డి పేర్కొన్నారు.
మొయిళ్ల సురేష్‌రెడ్డి, గౌరిపై విమర్శలు చేయనని, అది వారి విచక్షణకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర సమయంలో భోజనాల్లేక నెల్లూరులోని ఓ కల్యాణ మండపంలో ఉన్నప్పుడు తాను పరామర్శించడం నేరమా అని ప్రశ్నించారు.