కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. తాజాగా మేకలు, గొర్రెలు కూడా ఈ వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. మూగ జీవులను కూడా ఈ వైరస్ వదిలిపెట్టడం లేదు. ఫలితంగా గొర్రెలు, మేకలకు కూడా ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు ప్రాంతంలో ఉన్న చిక్కనాయకహల్లిలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిక్కనాయకహల్లి ప్రాంతంలో అనేక గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు మేకలు, గొర్రెలతోపాటు వాటి యజమానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.
గొర్రెలు, మేకలకు కరోనా పరీక్షలు నిర్వహించామని, 50 మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. జీవాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంపై జిల్లా కమిషనర్ కె.రాకేశ్ కుమార్ విచారణ చేపట్టారు.
కరోనా సోకడం వల్లే మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని ఖచ్చితంగా చెప్పలేమని పశువైద్యులు అంటున్నారు. మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ చేరినా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని చెబుతున్నారు.
జీవాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్టు తెలిపారు. కాగా, గొర్రెల కాపరికి మాత్రం కరోనా పాజిటివ్ అని వచ్చినట్టు తెలుస్తోంది.