Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నరు అబ్దుల్ నజీర్ నేపథ్యం ఏంటి?

Abdul Nazeer
, ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (12:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నరుగా అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 12 రాష్ట్రాలకు కొత్తగా కేంద్రం గవర్నర్లను నియమించింది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లకు స్థానభ్రంశం కల్పించింది. ఇలాంటి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఏపీ గవర్నరుగా ఉన్న బిశ్వభూషణ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నరుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
 
మరోవైపు, ఏపీ గవర్నరుగా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్.. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. సుప్రీంకోర్టు వెలువరించిన అనేక కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ముఖ్యంగా, అయోధ్య రామమందిరంపై ప్రతిష్టాత్మక తీర్పు ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయనా ఒకరు. ఇటీవలే పదవీ విరమణ చేశారు. 
 
జస్టిస్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా అవకాశం దక్కించుకున్నారు. 
 
ఫిబ్రవరి 2017లో జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. త్రిపుల్ తలాఖ్ చెల్లదంటూ 2017లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఉన్నారు. 2019లో అయోధ్య రామమందిరంపై తీర్పు వెలువరించిన రాజ్యంగ ధర్మాసనంలోనూ ఆయన సభ్యులు. 
 
ఆ ధర్మాసనంలోని ఒకే ఒక మైనారిటీ న్యాయమూర్తి జస్టిస్ నజీర్. అయోధ్యలో హిందూ నిర్మాణం ఉనికి ఉందంటూ పురావస్తుశాఖ ఇచ్చిన తీర్పును ఆయన సమర్ధించారు. నోట్ల రద్దు చట్టబద్ధమని ప్రకటించిన సుప్రీం ధర్మాసనంలోనూ ఆయన సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేసిన జస్టిస్ నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవికి సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే....