వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, ఆయన గురువారం జరిగిన సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో కరోనా వైరస్ మహమ్మారిపై జరిగిన చర్చలో పాల్గొన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద దుమారాన్నే రేపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేలుకోసం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై కోర్టులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
అయితే విజయసాయి రెడ్డి ప్రసంగాన్ని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సబ్జెక్టు దాటి మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా విజయసాయి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూ పోయారు.
ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు కనకమేడల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడటం దారుణమన్నారు. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారన్నారు. కరోనా గురించి మాట్లాడకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటం ఏమిటని ఆయన నిలదీశారు.