తనకు తినేందుకు తిండి లేకుండా చేసి మాడ్చి చంపేందుకు ప్లాన్ వేస్తున్నట్టుగా ఉన్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ అన్నారు. ఆయన శుక్రవారం మరోమారు వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా, వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫోర్జరీ కేసులో జేసీ సోదరుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడిని వైకాపా సర్కారు అరెస్టు చేయించింది. కానీ, జేసీ దివాకర్ రెడ్డిని మాత్రం టచ్ చేయలేదు. దీనిపై జేసీ స్పందించారు.
'ఇప్పటి వరకూ జగన్ సర్కార్.. దివాకరరెడ్డిని టచ్ చేయలేకపోయింది. బహుశా నేనెప్పుడూ జగన్‌ను.. మా వాడు.. మా వాడు అంటున్నా కదా. ఆ సంబంధంతోనే ఏమీ చేయలేదు. గనులను క్లోజ్ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఈ గనులు తప్ప ఇతర ఆస్తిపాస్తులేమీ నాకు లేవు. అందులో వచ్చే ఆదాయంతోనే అన్నం వండుకుని తింటున్నాము.
ఏమీ లేకుండా మాడ్చి చంపడానికే ఇదంతా చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మైనింగ్ లేకుండా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. పర్మిట్లు తీసుకుందాం అనుకుంటే మీ నాయకుడికి చెప్పు.. మీ అబ్బకు చెప్పు అన్నట్లుగా ఆఫీసు నుంచి వెళ్లారు' అని జేసీ వ్యాఖ్యానించారు.
'నా భార్యకు పెరాలసిస్ ఆరోగ్యం బాగలేదు. నడవలేని పరిస్థితిలో ఉన్నారు. పర్మిట్ల కోసం మరోసారి వస్తాను. ఇక్కడే కూర్చుంటా.. మైనింగ్‌కు పర్మిట్ ఇవ్వకుంటే అన్నం లేకుండా మాడిపైకి పోతాం. నాకు.. నా భార్యకు వయస్సు అయిపోయింది. వాళ్ల కోరిక కూడా నెరవేరుతుంది. ఇక్కడే కూర్చుని నిరాహారదీక్ష చేస్తా. ఏడీగారు దొంగ క్యాంపు పోయారు.
సోమవారం కూడా దొంగ క్యాంపు పోతే పోనీ ఏం చేస్తారు. పోలీసులు సత్కారం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాణ్ని. అందరికీ చెబుతున్నా.. మీరు నాకు సత్కారం చేస్తారు. అందుకు రెట్టింపు సత్కారం కూడా మీకు ఏదో ఒక రోజు వస్తుంది. నాకు సత్కారం చేసే పెద్దవాళ్లకు సత్కారం చేసి మా రుణం తీర్చుకుంటాం.. ఇంతకంటే ఘనమైన సత్కారం తీర్చుకోకతప్పదు' అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.